Shubhamshu Shukla: ఇదో అద్భుత ప్రయాణం.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నా.. అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా లైవ్‌కాల్..
శుభాంశు శుక్లా తన తోటి వ్యోమగాములతో కలిసి అంతరిక్షం నుంచి లైవ్‌కాల్‌లో మాట్లాడాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ లైవ్ కాల్ సాగింది.

Shubhamshu Shukla
Shubhamshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12.01గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం-4 మిషన్ లో భాగంగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో వారు అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. ప్రస్తుతం భూకక్ష్యలో వ్యోమనౌకలో తిరుగుతున్న వారు.. అంతరిక్షం నుంచి లైవ్ కాల్ లో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
శుభాంశు శుక్లా తన తోటి వ్యోమగాములతో కలిసి లైవ్‌కాల్‌లో మాట్లాడాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ లైవ్ కాల్ సాగింది. ‘‘అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం. నా తోటి వ్యోమగాములతో ఇక్కడ ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. వావ్.. ఎంత అద్భుతమైన ప్రయాణం. నేను లాంచ్ ప్యాడ్‌లోని క్యాప్సూల్‌లో కూర్చున్నప్పుడు, నా మనసులో ఉన్న ఒకేఒక్క ఆలోచన.. పదండి వెళ్దాం.. అంటూ శుక్లా చెప్పారు. ఇదో గొప్ప ప్రయాణం. మాతో పాటు ఈ రైడ్‌కు జాయ్ (ఒక బేబీ హంస బొమ్మ) కూడా వచ్చింది. భారత సంప్రదాయంలో హంసను విజ్ఞానంగా సూచిస్తారు. భారరహిత స్థితికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం. అంతరిక్షంలో ఎలా నడవాలి.. ఎలా తినాలి.. అనే విషయాలను చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీలైనంత ఎక్కువ సమయం గడుపుతా. నా అనుభవాలను మీతో పంచుకునేందుకు ఎదురు చూస్తున్నా’’ అని శుభాంశు శుక్లా తెలిపారు.
Watch live as the Ax-4 astronauts check in from orbit https://t.co/nn1GXw6JdQ
— SpaceX (@SpaceX) June 26, 2025
శుభాంశు శుక్లా బృందం 14రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. అక్కడ దాదాపు 60 ప్రయోగాలు చేస్తారు. ఇందులో హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, సీడ్ జెర్మినేషన్ లలో మైక్రో గ్రావిటీ పరిశోధనలు ఉన్నాయి. ఇదిలాఉంటే.. 41ఏళ్ల తర్వాత భారతీయుడొకరు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి.