వావ్.. అంగారక గ్రహంపై ఇంటర్నెట్.. స్పేస్‌ఎక్స్ ‘మార్స్‌లింక్’ ప్రతిపాదన గురించి తెలుసా?
మార్స్ నుంచి భూమికి, భూమి నుంచి మార్స్‌కి సమాచార బదిలీ కోసం ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.

అంగారక గ్రహంపై సజీవులు ఉండేందుకు అనువైన వాతావరణం ఉండొచ్చని చాలాకాలంగా భావిస్తున్నారు. ఆ గ్రహంపై పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి అనేక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. భూమిపై అన్ని దేశాల్లోనూ ఇంటర్నెట్ ఉంది. మరి మార్స్ చుట్టూ కూడా ఇంటర్నెట్ ఉంటే ఎలా ఉంటుంది? ఆ గ్రహం చుట్టూ ఇంటర్నెట్ ఉంటే భవిష్యత్తులో అంగారకుడిపై చేయబోయే పరిశోధనలకు చాలా ఉపయోగపడుతుంది.
ఎలాన్ మస్క్‌కు చెందిన “స్పేస్‌ఎక్స్” అంగారక గ్రహం చుట్టూ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను తీసుకురావాలని ప్రతిపాదించింది. దీనికి “మార్స్‌లింక్” అని పేరు పెట్టింది. భవిష్యత్తు మిషన్‌లకు కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన చేసింది. మార్స్ నుంచి భూమికి, భూమి నుంచి మార్స్‌కి సమాచార బదిలీ కోసం ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.
ఇటీవల నాసా నేతృత్వంలోని నిర్వహించిన మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్ అనాలిసిస్ గ్రూప్ సమావేశంలో ఈ “మార్స్‌లింక్”ను ప్రతిపాదించింది స్పేస్‌ఎక్స్. మార్స్‌పై పదార్థాల, జీవుల అన్వేషణకు, ఆ గ్రహంపై మానవ నివాసానికి గల పరిస్థితుల అన్వేషణ గురించి చర్చించడానికి ఈ సమావేశం జరిగింది. ఇప్పటికే స్పేస్‌ఎక్స్ గ్లోబల్ ఇంటర్నెట్ కవరేజీని అందిస్తూ భూ కక్ష్యలో స్టార్‌లింక్ ఉపగ్రహాలను ఉంచింది. ఇటువంటి మోడల్ మాదిరిగానే “మార్స్‌లింక్” కూడా అంగారకుడిపై పనిచేస్తుంది.