శ్రీలంక. అక్కడ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆవేదన మాత్రమే వినిపిస్తోంది. పండగ పూట జరిగిన మారణహోమం నుంచి వాళ్లు తేరుకోలేదు. ప్రభుత్వం, పోలీసులు ఎంత మనోధైర్యం చెబుతున్నా.. వెంటాడుతున్న భయం వాళ్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఉగ్రవాదుల మారణహోమంపై ఆ దేశ ప్రజల ఆవేదనకు అక్షర రూపం ఇది..
– పండుగ దినమని కూడా ప్రాణభిక్ష పెట్టలేదు. వందల మంది ప్రాణాలను నిర్ధాక్షిణ్యంగా క్రూరత్వంతో బలిగొన్నారు. పండుగ రోజున నిర్మలమైన మనస్సుతో దేవుని కోసం తరలి వస్తే.. రక్తశిక్తమైన దేహాలే మిగిలాయి. అయినోళ్ల గుండెలు బాధలతో నిండాయి. కాపాడతాడని వస్తే తిరిగిరాని లోకాలకు పంపేశాడు దేవుడు.
– బాంబు పేలుళ్ల బాధితుల ఆవేదనకు గుండె తరుక్కుపోతుంది. ప్రమాదస్థలంలో నుంచి క్షతగాత్రులను కాపాడిన వారి మాటలు ఇలా ఉన్నాయి.
– ‘ఆదివారం జరిగిన ప్రమాదంలో గాయాలకు గురైన 8మంది చిన్నారులను నా చేతులతో మోశాను. ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు ఆరేళ్లు, మరొకరు ఎనిమిదేళ్లు వయస్సు రీత్యా నా పిల్లల వయస్సుంటారు. వారి బట్టలు చినిగిపోయి రక్తంతో వారి దేహాలు తడిచిపోయి ఉన్నాయి. దాన్ని చూసి నేను తట్టుకోలేకపోయాను’
– వీధులు శుభ్రం చేసే.. మాలతి విక్రమా మాట్లాడుతూ.. ‘రోడ్డు మీద కనిపించే ప్లాస్టిక్ సంచులను చూసినా, పని చేయాలన్నా భయమేస్తుంది. బస్సుల్లో, ట్రైన్‌లలో ప్రయాణించాలన్నా భయం. ఎక్కడ ఏ బాంబు పార్శిల్ చేసి ఉందోనని’
– టక్ టక్ డ్రైవర్.. ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. ‘పేలుడికి గురైన సిన్నామోన్ గ్రాండ్ హోటల్‌లో 23 ఏళ్ల వ్యక్తి ప్రమాదంలో బలైపోయాడు. అతనికి వచ్చే వారమే పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కావలసిన ఇంట ఈ రోజు శవం ఉంది’
– ప్రమాదం జరిగిన తర్వాత క్షతగాత్రులను, బాధితులను ఆదుకునేందుకు బౌద్ధ సన్యాసులలో ఒకరైన చర్చిల్ కరుణరత్నే(52) అక్కడికి వెళ్లారట. ఆయన మాటల్లో.. ‘ప్రమాదం గురించి తెలిసి చలించిపోయాను. ఏదో ఒక సాయం చేయాలని అనుకున్నాను. అక్కడికి వెళ్లి చూస్తే మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. నా పిల్లలు టీవీలో అవి చూసి భయపడిపోయారు. ఇవన్నీ జరుగుతుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నిస్తుంటే నా దగ్గర సమాధానం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
– వరుసగా పేలుతున్న బాంబులు ఎక్కడి నుంచి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రాణభయం కొలంబోవాసులను బలహీనులను చేసింది. ఉదయం 8.30గంటలకు పేలిన బాంబు తర్వాత ఒకటి తర్వాత మరొకటిగా వరసగా 9 బాంబులు శ్రీలంకను అల్లకల్లోలం చేశాయి.