Srilanka Crisis : శ్రీలంక కష్టాలు తీరే అవకాశం..ఆదుకోవటానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు

శ్రీలంక కష్టాలు తీరే అవకాశం కనిపిస్తోంది. అప్పు కోసం IMFతో శ్రీలంక జరిపిన చర్చలు ఫలిస్తున్నాయి. శ్రీలంకను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది.

Goog news for Srilanka World bank lone : నిత్యావసరాలు దొరక్క, పెట్రోల్ కొనలేక, కరెంటు కోతలు తట్టుకోలేక అల్లాడుతున్న శ్రీలంక కష్టాలు కొంత తీరే అవకాశం కనిపిస్తోంది. అప్పు కోసం IMFతో శ్రీలంక జరిపిన చర్చలు ఫలిస్తున్నాయి. శ్రీలంకను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. భారత్ తన సాయం కొనసాగిస్తోంది. మరోవైపు అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సొంత ప్రభుత్వం నుంచే మద్దతు లభిస్తోంది.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు మంచిరోజులొస్తాయన్న ఆశ కలుగుతోంది. విదేశీ అప్పులు తీర్చలేక దివాళా తీసినట్టు ప్రకటించినప్పటికీ..సంక్షుభిత పరిస్థితుల్లో లంకకు అప్పిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్-IMF ముందుకొచ్చాయి. ఆస్పత్రుల్లో మందులు సైతం లేక….వైద్యులు, నర్సులు ఆందోళనల బాట పట్టిన లంకకు ముందుగా వరల్డ్ బ్యాంక్ అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజ్ ఇవ్వనుంది. ఇందులో 76 కోట్లు అత్యవసర మందులు కొనుగోలు చేసేందుకు వీలుగా తక్షణమే అందించనున్నారు. మొత్తం ప్కాకేజ్ విలువ 3వేల800 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. స్కూల్ పిల్లలకు ఆహారం, పేదలకు ఆర్థిక సాయం వంటివాటికోసం ఈ మొత్తాన్ని ఖర్చుచేయనుంది శ్రీలంక.

Also read : Australian PM Scott Morrison: వికలాంగ చిన్నారులపై ఆస్ట్రేలియా ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు..

సంక్షోభంనుంచి బయటపడేందుకు తక్షణమే 30వేల 400 కోట్లు కావాలని శ్రీలంక అంచనావేసింది. అప్పు ఇవ్వాలని శ్రీలంక ప్రభుత్వం IMF, భారత్‌తో పాటు మరికొన్నిదేశాలకు విజ్ఞప్తి చేసింది. శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రే నేతృత్వంలోని బృందం ఏప్రిల్ 18 నుంచి 22 మధ్య వాషింగ్టన్‌లో IMF ప్రతినిధులతో వరుస సమావేశాలు జరిపింది. దివాళా తీసిన శ్రీలంకకు అప్పిచ్చేందుకు మొదట మీనమేషాలు లెక్కించినప్పటికీ…వరుస చర్చల తర్వాత సానుకూలంగానే స్పందించింది. ఈ మేరకు IMF ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీలంక ప్రతినిధి బృందంతో చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపింది. శ్రీలంకలో ఆర్థిక స్థిరత్వం సాధించడం, సామాజిక భద్రత పెంచడం లక్ష్యంగా IMF ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపింది.

సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంకకు మొదటి నుంచీ అండగా ఉంటున్న భారత్ తన సాయాన్ని మరింత పెంచింది. శ్రీలంక చమురును దిగుమతి చేసుకునేందుకు 3వేల 800 కోట్ల విలువైన క్రెడిట్‌ లైన్ ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఆసియా క్లియరింగ్ యూనియన్‌కు శ్రీలంక ఇవ్వాల్సిన 150 కోట్ల డాలర్ల పేమెంట్‌ను వాయిదా వేయడానికి అంగీకరించింది. వీటితోపాటు నిత్యావసరాల దిగుమతి కోసం మరో 150 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయాలని శ్రీలంక ప్రభుత్వం భారత్‌కు విజ్ఞప్తిచేసింది.

Mystery Disease‌ : అంతు చిక్కని వ్యాధితో కుప్పకూలిపోతున్న చిన్నారులు..ఐదు దేశాల్లో 100 కేసులు

అయితే భారత్‌తో సహా మరికొన్ని దేశాలు, ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఆదుకున్నప్పటికీ శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఇప్పుడప్పడే గాడిన పడే అవకాశం లేదని అలీ సబ్రే అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో దేశంలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముందని హెచ్చరించారు. అటు కల్లోలం వేళ దేశంలో స్థోమత ఉన్న ప్రజలతో పాటు విదేశాల్లో స్థిరపడిన లంకేయులు భారీగా డొనేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది.

మరోవైపు నెలరోజులపై నుంచీ కొనసాగుతున్న శ్రీలంక ఆందోళనలు సద్దుమణగడం లేదు. రామబుక్కనలో ఆందోళనకారులపై శ్రీలంక పోలీసుల కాల్పుల తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజలే కాదు..బౌద్ధ సన్యాసులు, ప్రభుత్వంలోని కొందరు మంత్రులు సైతం గో హోమ్ గోట అని నినదిస్తున్నారు. అధ్యక్ష కార్యాలయం బయట ఆందోళనలు జరుపుతున్న వేలమందికి శ్రీలంక మంత్రి నాలాక గోడాహెవా మద్దతు ప్రకటించారు.

శ్రీలంక సమస్యలన్నింటికీ రాజపక్స వంశవృక్షం కారణమని ఆ దేశ ప్రజలు ఆరోపిస్తున్నారు. తన సోదరులు చమల్, బసిల్, మేనల్లుడు నమాల్‌ను క్యాబినెట్ నుంచి తప్పించి..ఆందోళనకారులను శాంతింప చేయడానికి అధ్యక్షుడు గొటబయ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రామబుక్కనలో నిరసనకారులపై కాల్పుల తర్వాత ప్రభుత్వం ప్రజల నమ్మకం కోల్పోయిందని గోడాహెవా ఆరోపించారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రితో సహా మొత్తం క్యాబినెట్ రాజీనామా చేసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుచేస్తేనే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుందన్నారు. అన్ని పార్టీల ప్రాతినిధ్యం ఉండేలా ఏడాది గడువుతో చిన్నస్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేసి, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు