శ్రీలంకలో మారణహోమం వెనుక ఐసిస్ హస్తం

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 10:18 AM IST
శ్రీలంకలో మారణహోమం వెనుక ఐసిస్ హస్తం

Updated On : April 21, 2019 / 10:18 AM IST

ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లిపోయింది. 6 గంటల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఇప్పటివరకు 200మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. ఈస్టర్ రోజున చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా ఉగ్రదాడులు జరిగాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఈలం వేర్పాటువాదంతో అట్టుడికిన శ్రీలంక కొన్నాళ్లుగా ప్రశాంత జీవనం గడుపుతోంది. ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది. శ్రీలంక రాజధాని కొలంబలో నెత్తుటేరులు పారాయి. ఈ మారణహోమం వెనుక ఐసిస్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇస్లామిక్ ఉగ్రవాదుల పనే అని శ్రీలంక ప్రభుత్వం నమ్ముతోంది.

శ్రీలంకలో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని భారత ప్రభుత్వం 10 రోజుల క్రితమే లంక ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అక్కడి ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇచ్చింది. అయినా లంక ప్రభుత్వం పట్టించుకోలేదు. ఊహించిన రీతిలోనే ఐసిస్ పేలుళ్లకు పాల్పడింది. ప్రధానంగా చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా బాంబులు పేల్చారు. ఆదివారం(ఏప్రిల్ 21,2019) ఈస్టర్ పండుగ రోజే ముష్కరులు పంజా విసిరారు. దీంతో కొలంబో రక్తసిక్తమైంది. ఈ దాడుల వెనుక ఐసిస్ హస్తం ఉందని అనుమానిస్తున్నా.. ఇప్పటివరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.

ఆదివారం ఉదయం 8గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. చర్చిలు, హోటళ్లే టార్గెట్ గా బ్లాస్ట్ లు జరిగాయి. కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికలోవా చర్చిలలో పేలుళ్లు జరిగాయి. షాంగ్రిల్లా, సినామోన్ గ్రాండ్, కింగ్స్ బరీ హోటల్స్ లో బ్లాస్ట్ లు జరిగాయి. 2 చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగినట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. బట్టికలోవా చర్చి, హోటల్ షాంగ్రిల్లాలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఉగ్రవాదులు ఈస్టర్ వేడుకలను టార్గెట్ చేశారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని 3 చర్చిలు, 3 హోటళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు జరిగాయి. వరుస పేలుళ్లతో ప్రజల్లో భయం నెలకొంది. పేలుళ్లలో 35మంది విదేశీయులు చనిపోయారు.

వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వ అలర్ట్ అయ్యింది. కొలంబోలో కర్ఫ్యూ విధించింది. ఆదివారం (ఏప్రిల్ 21,2019) సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం(ఏప్రిల్ 22,2019) ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని చెప్పింది. ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. రూమర్స్ వ్యాప్తి కాకుండా సోషల్ మీడియాపై తాత్కాలిక బ్యాన్ విధించింది. కొలంబోలో ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు.