ముదిరిన వివాదం.. భారత్ నుంచి ఆరుగురు కెనడా దౌత్యవేత్తల బహిష్కరణ

ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వ చర్యలు వారి భద్రతకు అపాయం కలిగించేలా ఉన్నాయి.

India Expels Six Canadian Diplomats (Photo Credit : Google)

India Expels Six Canadian Diplomats : నార్త్ అమెరికన్ కంట్రీ కెనడా-భారత్ మధ్య దౌత్యపరమైన వివాదాలు మరింత ముదిరాయి. ఈ క్రమంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. వారంతా అక్టోబర్ 19లోగా భారత్ ను వీడాలని ఆదేశించింది. బహిష్కరణకు గురైన వారిలో నలుగురు కార్యదర్శులు ఉన్నారు. భారత్ లో కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టీవర్ట్ రాస్ వీలర్, డిప్యూటీ హైకమిషనర్ ప్యాట్రిక్ హెబర్ట్, మేరీ క్యాథరిన్ జోలీ, ఇయాన్ రోస్ డేవిడ్, ఆడమ్ జేమ్స్ చుపికా, పౌలా ఆర్జులా.. వీరంతా భారత్ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

కెనడాతో దౌత్యపరమైన వివాదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో కెనడాలోని హైకమిషనర్ సహా ఇతర దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా.. వీరిని అనుమానితుల జాబితాలో చేర్చింది. దీంతో భారత్-కెనడా మధ్య వివాదం చెలరేగింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారి భద్రత విషయంలో కెనడా ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేనందున అందరినీ వెనక్కి పిలిపిస్తున్నట్లు భారత్ తెలిపింది.

ఖలిస్థానీ తీవ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రభుత్వ తీరుపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిజ్జర్ హత్య కేసులో కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా ఇతర దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ కు సమన్లు పంపింది. కెనడా ప్రధాని ట్రూడో పై భారత్ ఫైర్ అయ్యింది. ట్రూడో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తింది.

కెనడాలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ట్రూడో ప్రభుత్వం నిజ్జర్ హత్యను ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కెనడాలో ఇటీవల జీవన వ్యయాలు భారీగా పెరిగిపోవడంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ కారణంతో ఎన్నికల్లో ట్రూడోకి ఓటమి తప్పదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ట్రూడో ఎత్తుగడ వేశారని, ప్రాబల్యం ఉన్న ఖలిస్థానీ వేర్పాటువాదుల మద్దతు కోసం పాకులాడుతున్నారని, ఇందులో భాగంగానే నిజ్జర్ హత్యను రాజకీయంగా వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

”ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వ చర్యలు వారి భద్రతకు అపాయం కలిగించేలా ఉన్నాయి. ప్రస్తుత ట్రూడో ప్రభుత్వం నిబద్ధతపై మాకు విశ్వాసం లేదు. అందువల్ల, భారత్ లోని కెనడా హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది” అని ఎంఈఏ ఓ ప్రకటనలో తెలిపింది. కెనడా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం.. కెనడాతో సంబంధాలు మరింత క్షీణించినట్లు అయ్యింది.

Also Read : సల్మాన్ ఖాన్‌తో స్నేహమే సిద్ధిఖీ ప్రాణం తీసిందా? అసలు బాలీవుడ్ స్టార్‌తో బిష్ణోయ్ గ్యాంగ్ శత్రుత్వం ఎందుకు?