హెలికాప్ట‌ర్ కూలి 13 మంది సైనికులు మృతి

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 10:27 AM IST
హెలికాప్ట‌ర్ కూలి 13 మంది సైనికులు మృతి

Updated On : November 26, 2019 / 10:27 AM IST

మాలీ దేశంలో ఓ హెలికాప్ట‌ర్ కూలింది. ఈ ప్రమాదంలో 13 మంది ఫ్రెంచ్ సైనికులు మృతి చెందారు. రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఆరుగురు అధికారులు, మాస్టర్ కార్పోరల్ ఉన్నారు. జిహాదీల ఏరివేత కోసం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ స‌మ‌యంలో ఈ ఘటన జ‌రిగిన‌ట్లు ఫ్రాన్స్ అధ్య‌క్ష భ‌వ‌నం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది.

సోమ‌వారం (నవంబర్26, 2019) సాయంత్రం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన ప‌ట్ల ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఎమ్మాన్యువెల్ మాక్ర‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ 13 మంది హీరోలకు ఒకే లక్ష్యం ఉందని, అది మమ్మల్ని రక్షించడం అని అధ్యక్షుడు మాక్రాన్ ఒక ట్వీట్‌ చేశాడు.

మాలీ దేశంలో 2012 నుంచి ఇస్లామిక్ మిలిటెంట్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. 2013లో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఉత్తరాన భారీ భాగాలను స్వాధీనం చేసుకున్న తరువాత ఫ్రాన్స్ వేలాది మంది సైనికులను మాలికి మోహరించింది. అప్పటి నుండి మాలి సైన్యం భూ భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది.

కానీ అక్కడ అభద్రత కొనసాగుతోంది. ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు హింస వ్యాపించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాలి, మౌరిటానియా, నైజర్, బుర్కినా ఫాసో, చాడ్ దళాలకు మద్దతుగా ఫ్రాన్స్‌లో ఇప్పుడు 4 వేల 500 మంది సైనికులు ఉన్నారు.