ట్రంప్ vs బైడన్: ఎవరు గెలిస్తే ఇండియాకు లాభం?

  • Publish Date - September 29, 2020 / 05:37 PM IST

Trump vs Biden 2020 Presidential Debate: ఇంతకీ భారతీయుల మద్దతు ఎవరికి? వరస వైఫల్యాలను ట్రంప్ అధిగమించగలరా? ఫెయిల్యూర్స్‌ని మించిన సక్సెస్ టీకాతో సాధించగలరా?

అంతంత మాత్రంగా ఉన్న ట్రంప్ ఇమేజ్ఈ ఏడాదిలో కరోనా విజృంభణతో పూర్తిగా డ్యామేజైంది.అంతకు ముందే అమెరికా ఫస్ట్ నినాదంతో తీసుకున్న చర్యలు 2018 నుంచి అమెరికాలో స్థిరపడిన ఇతర వారికి కోపం తెప్పించింది.దాని తర్వాత పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని ట్రంప్ మేనేజ్ చేయలేకపోయారంటారు

కరోనా వైరస్ తాండవంతో రెండులక్షలమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా ఈ మరణమృదంగం మోగుతూనే ఉంది.



అవసరమైన సమయంలో స్పందించకపోవడంతో పాటు, మంచి ఎండింగ్ ఇస్తామంటూ బీరాలు పలికిన ట్రంప్ ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేశారు. కొన్ని సార్లు రాష్ట్రాల గవర్నర్లపై ఆ తప్పిదాన్ని తోశారు. ఆ తర్వాత చైనా చేసిన పాపం అంటూ తన వైఫల్యాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేశారు. ఇదే డెమోక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్‌కి బాగా కలిసి వచ్చింది.



సింపుల్‌గా ట్రంప్ చేసిందేంటో చేయనదేంటో ఓటర్లకి వివరించడంతో పాటు, సుతిమెత్తని విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు బైడెన్. రెండులక్షల ప్రాణాలు కోల్పోవడానికి ట్రంప్ కారకులయ్యారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే ఆయన పాపులారిటీ బాగా పెరిగిపోవడానికి దోహదపడుతోంది

ఇక కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల్లో విస్త్రతంగా పర్యటించలేని జో బైడెన్ Presidential Debateని పూర్తిగా
తన ప్రచార కార్యక్రమంగా మార్చేస్తారనడంలో సందేహం లేదంటున్నారు. ఓ వైపు ట్రంప్ వైఫల్యాలపై విమర్శలు
గుప్పిస్తూనే మరోవైపు అధ్యక్షపదవికి తన అర్హతలను వివరించబోతున్నారు.



ట్రంప్ మాత్రం వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని, అదే తనకు రక్ష అవుతోందని ధీమాతో ఉన్నారు. అందుకే ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో కనీసం రెండు వ్యాక్సిన్లను తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ 3న ఎన్నికలు ఉండగా, నవంబర్ 1లోపే లక్షలసంఖ్యలో డోసులు పంపిణీతో, తానో రక్షకుడిగా బిల్డప్ ఇవ్వాలనేది ట్రంప్ ప్లాన్‌గా తెలుస్తోంది

ఈ విషయాన్ని ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్ ఖచ్చితంగా ప్రస్తావిస్తారనే అంచనాలు ఉన్నాయ్.



ట్రంప్‌కి ఎన్నికలలో పెద్ద షాక్ ఇచ్చే మరో అంశం జాతి వివక్ష. మేలో జార్జ్ ఫ్లాయిడ్‌పై పోలీసులు దాడి చేసి చంపిన తీరుపై అమెరికా అంతా అట్టుడికి పోయింది. కొన్ని రాష్ట్రాల్లో అమెరికా సైన్యం కూడా రంగంలోకి దిగితే కానీ పరిస్థితులు చక్కబడని పరిస్థితి. ఆ సందర్భంలో ట్రంప్ వ్యవహారశైలి కూడా చాలామందిలో ఆగ్రహం రగిల్చిందంటారు.

దాన్ని కూడా జో బైడెన్ తనకి అనువుగా మార్చుకున్నారు అంతేకాదు, కమలాహారిస్‌ని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్ధిగా ఎంపిక చేయడం ద్వారా నల్లజాతీయుల ఓట్లకి గురిపెట్టారు.

ఎన్నారైలే కీలకం:
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందులో భారతీయుల పాత్ర తప్పనిసరి. కీలకమైన స్వింగ్‌ రాష్ట్రాల్లో భారతీయుల ఓట్లు ఎవరికి లభిస్తే వారి అధ్యక్ష అవకాశాలు అంతగా మెరుగుపడతాయని భావిస్తుంటారు. ఈసారి కూడా ఆయా రాష్ట్రాల్లో భారతీయుల ఓట్లు సంపాదించేందుకు అధ్యక్ష అభ్యర్ధులు ట్రంప్‌, బిడెన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.



భారతీయులతో తనకు ఎంతో అనుబంధం ఉందని నిరూపించుకోవడం కోసం ట్రంప్, నమస్తే ట్రంప్‌, హౌడీమోడీ కార్యక్రమాల వీడియోలను ప్రచారంలో తెగ వాడేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్ధుల ముఖాముఖీలో హెచ్1బి వీసాలతో పాటు ప్రవాసభారతీయులను లక్ష్యంగా చేసుకుని కూడా డిబేట్ జరిగే ఛాన్స్ ఉంది.

ట్రెండింగ్ వార్తలు