ఇరాన్ దాడి మరుసటి రోజే బాగ్దాద్‌లోకి యుద్ధ రాకెట్లు

బాగ్దాద్‌లోని అటవీ ప్రాంతంలో రెండు యుద్ధ రాకెట్లు కూలిపడ్డాయి. హై సెక్యూరిటీతో ఉన్న ఇరాక్ క్యాపిటల్ గ్రీన్ జోన్‌లో పడినప్పటికీ ప్రమాదం జరగలేదు. ఈ ప్రాంతంలో ఇరాక్ ఆర్మీ భద్రతా అధికారుల నివాసాలతో పాటు యూఎస్ మిషన్ అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.
బుధవారం అర్ధరాత్రికి ముందు బాగ్దాద్‌లో రెండు పేలుళ్లు వినిపించాయి. దీంతో గ్రీన్ జోన్ సెక్యూరిటీ అలర్ట్ అయింది. సరిగ్గా ఇరాక్ లో బాలిస్టిక్ మిస్సైల్ దాడులు జరిగిన 24గంటల్లో జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఎటువంటి ప్రాణహాని జరగలేదని అధికారులు వెల్లడించారు.
సులేమాని అంత్యక్రియలు జరిపిన వెంటనే…. ప్రతీకార చర్యలను ప్రారంభించింది. బుధవారం(జనవరి 8,2020) ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైల్స్‌ను ప్రయోగించింది. అమెరికా సైనిక, సంకీర్ణ దళాలకు ఆశ్రయం ఇస్తున్న రెండు ఇరాకీ సైనిక స్థావరాలైన అల్ అసాద్, ఇర్బిల్‌పై 12 క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా వెంటనే తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా మిత్రదేశాలపైనా దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.