మేమున్నాం : జపాన్ లో హాగిబిస్ బీభత్సం…2 యుద్ధ నౌకలు పంపిన భారత్

హగిబిస్ పెనుతుఫాన్ తో జపాన్ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో దేశంలోని పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి.14 నదులు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 225 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచిన పెనుగాలులతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలిపోయాయి. కొన్ని ప్రాంతాలలో బుల్లెట్ రైళ్లు కూడా సగం లోతు దాకా వరద నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో విమానసర్వీసులు,రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. తుఫాన్ నేపథ్యంలో రగ్బీ ప్రపంచ కప్ టోర్నమెంటును అధికారులు రద్దు చేశారు.
వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 30మందికి పైగా మరణించారు. కొండచరియలు విరిగిపడటం,వరదలు పోటెత్తడంతో పలువురు గల్లంతయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం 27,000 మంది సైనిక బలగాలను, ఇతర సహాయక సిబ్బందిని రంగంలోకి దించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను హెలికాఫ్టర్లు, పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాజధాని నగరం టోక్యోపై కూడా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. టోక్యోకు నైరుతి వైపున ఉన్న ఇజు ద్వీపకల్పంలోకి శనివారం సాయంత్రం 7 గంటలకు టైపూన్ ప్రవేశించింది. దాని ప్రభావంతో దాదాపు ఐదు లక్షల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రేటర్ టోక్యో పరిధిలో 1,50,000 నివాసాలలోకి నీరు చేరింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఫుజీ పర్వతానికి సమీపంలో ఉన్న హకోన్ పట్టణంలో శుక్ర, శనివారాల్లో కలిపి 1 మీటరు (3 అడుగుల)కు పైగా వర్షపాతం నమోదైంది. కేవలం 48 గంటల్లోనే అంత భారీ వర్షపాతం నమోదవ్వడం జపాన్ చరిత్రలో ఇదే మొదటిసారి.
తుఫాన్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జపాన్‌కు సాయం అందించేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ కిల్టన్‌ను ఆ దేశానికి తరలించింది. కాగా, హగిబిస్ తుఫాన్ మృతులకు ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఆపద సమయంలో జపాన్ కి అండగా ఉంటామని మోడీ తెలిపారు. జపాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భారత నౌకాదళ సిబ్బంది జపాన్ సహాయకచర్యల్లో పాల్లొని సహాయం చేయనున్నట్లు మోడీ తెలిపారు.