అమెరికా దాడుల్లో భారత జెండా ఎత్తిందెవరు.. రీజన్ ఏంటి?

Indian Flag: యూఎస్ కాంగ్రెస్‌పై జరిగిన దాడిలో ఆందోళనకారుల చేతుల్లో అమెరికన్ కాన్ఫిడరేట్ జెండాలు, అమెరికా జెండాలతో పాటు భారత త్రివర్ణ పతాకం కూడా కనిపించింది. ఆ జెండా పట్టుకున్న వ్యక్తి ఎవరో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు అతని పేరు విన్సెంట్ జేవియర్ పాలతింగల్ గా తెలుసుకున్నారు. అంతేకాదు అతని పూర్తి వివరాలు బయటికొచ్చాయి. వర్జీనియాకు చెందిన వ్యక్తి.
అతని మూలాలు ఇండియావే. కేరళలోని కొచ్చికి చెందిన విన్సెంట్.. గతంలో ట్రంప్ ప్రెసిడెంట్స్ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్‌లో సభ్యుడిగా కూడా ఉన్నాడు.
ఇండియన్ జెండా ఎందుకు..
ప్రముఖ చానెల్ న్యూస్18 ఘటనకు సంబంధించి విన్సెంట్‌తో మాట్లాడగా.. తాను క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన సమయంలో దూరంగా ఉన్నానని చెప్పాడు. ఎన్నికల్లో జరిగిన మోసానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలపడానికే అక్కడ ఉన్నానని స్పష్టం చేశాడు. ట్రంప్ మద్దతుదారులు జాత్యాహంకారులు కాదని, అక్కడ జరిగింది అటువంటి ఉద్యమం కాదని చెప్పడానికే తాను త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నట్లు చెప్పడం గమనార్హం.
ఒకవేళ జాత్యాహంకార ఉద్యమమే అయితే అలా త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేవాడిని కాదని చెప్పాడు. ట్రంప్ మద్దతుదారుల్లో 10 మంది ఇండియన్స్ ఉన్నారని, అందులో కేరళకు చెందిన ఐదుగురు ఉన్నారని తెలిపాడు. ట్రంప్ ఎప్పుడు ర్యాలీల్లో పాల్గొన్నప్పటికీ వియత్నాం, కొరియా, పాకిస్థాన్‌కు చెందిన వాళ్లు వారి దేశాల జెండాలు పట్టుకుంటారని, ఈసారి కూడా అలాంటి ర్యాలీయే అని చెప్పడానికే అలా చేసినట్లు స్పష్టం చేశాడు.
ఇది పెద్ద హింస కాదు..
క్యాపిటల్ హిల్‌లో జరిగిన హింసను విన్సెంట్ సీరియస్‌గా తీసుకోలేదు. బిల్డింగ్ బయట లక్షల మందిలో ఓ 50 మంది ఈ హింసకు పాల్పడ్డారని, దీనివల్ల ర్యాలీ ప్రయోజనం దెబ్బతిందని విన్సెంట్ అన్నాడు. ట్రంప్ మద్దతుదారులంటూ బయటి వ్యక్తులు అందులో చొరబడ్డారని, వాళ్లే ఈ హింసకు పాల్పడ్డారని ఆరోపణలు చెప్పుకొచ్చాడు.