అమెరికాలోని భారతీయ విద్యార్థులకు ఒకేసారి రెండు షాకులు ఇచ్చిన ట్రంప్

మదేశ జాతీయ భద్రతకు ముప్పు కలిగించే శక్తులను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Donald Trump

ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా విదేశీ విద్యార్థులు తమ దేశం వదిలి వెళ్లిపోవాల్సిందేనని ఇటీవల అమెరికా అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరో విచిత్ర రూల్‌ను తీసుకొచ్చింది.

తమ దేశ విద్యా సంస్థల్లో చదివుతున్న అంతర్జాతీయ విద్యార్థులు క్లాసులను ఎగ్గొట్టినా వీసాలను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా ఓ ప్రకటన చేస్తూ.. అమెరికాలోని ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ల నుంచి నుంచి డ్రాపౌట్‌ అయితే లేదా క్లాసులు ఎగ్గొడితే, విద్యాసంస్థలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోతే భవిష్యత్తులోనూ అమెరికా వీసాలు పొందే అర్హత ఉండదని తెలిపింది.

ఇటువంటి ఇబ్బందులను కొనితెచ్చుకోకుండా ఉండాలంటే రూల్స్‌కి అనుగుణంగా మెలగాలని చెప్పింది. గత ఏడాది అమెరికాలో ఉన్న విద్యార్థుల సంఖ్య 3,31,602. మరోవైపు, విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను నిలిపేస్తూ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశాలు ఇచ్చారు. దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాల ప్రొఫైల్‌లను పరిశీలించేందుకు విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమదేశ జాతీయ భద్రతకు ముప్పు కలిగించే శక్తులను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇప్పటికే అమెరికాలోని కాలేజీ ప్రాంగణాల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న భారతీయ విద్యార్థులతో పాటు, ఇతర అంతర్జాతీయ విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. హమాస్‌కు మద్దతుగా నిరసనలలో పాల్గొన్నారన్న ఆరోపణలతో కొన్ని విద్యార్థుల F-1 వీసాలు రద్దు చేయడమే కాకుండా, ఇటీవల మరింత ముందుకెళ్లి చిన్న చిన్న నేరాలను కూడా సాకుగా చూపించి విద్యార్థులను దేశం విడిచిపోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తోంది.

Also Read: మంత్రి నారా లోకేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాల్సిందే: పయ్యావుల కేశవ్, పల్లా శ్రీనివాసరావు

ఇటీవల అమెరికాలోని టెక్సాస్‌, మిస్సౌరీ, నెబ్రాస్కా వంటి పలు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు డీఎస్‌ఓలు (Designated School Officials) ఈ-మెయిల్‌లు పంపారు. అందులో వాళ్ల వీసాలు ఇక చెల్లవని, వెంటనే అమెరికా వదిలి వెళ్లాలని స్పష్టం చేశారు.

విద్యార్థులు గతంలో చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఓవర్ స్పీడింగ్, లైన్ షిఫ్టింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, చిన్న చోరీలు వంటి ఘటనలను కారణంగా చూపుతూ వీరి SEVIS (Student and Exchange Visitor Information System) రికార్డులు రద్దు చేశారు.

“మీ SEVIS రద్దయింది. I-20 ఫామ్ ఇక చెల్లదు. ఎంప్లాయ్‌మెంట్ అథరైజేషన్ డాక్యుమెంట్ కూడా ఇక చెల్లదు. మీరు ఇక అమెరికాలో చదవడం, పనిచేయడం చట్టబద్ధంగా కుదరదు. ఇప్పటికీ మీరు అమెరికాలో ఉంటే, వెంటనే దేశం విడిచిపోవడానికి ఏర్పాట్లు చేసుకోండి” అని అమెరికా అధికారులు కొన్ని రోజుల క్రితం పేర్కొన్నారు.