మంత్రి నారా లోకేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాల్సిందే: పయ్యావుల కేశవ్, పల్లా శ్రీనివాసరావు
లోకేశ్‌ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే ప్రతిపాదనను తాము అందరం కలిసి పార్టీ అధినేత ముందు పెడతామని తెలిపారు.

మంత్రి నారా లోకేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తోందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కడపలోని ‘మహానాడు’ ప్రాంగణంలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలతో పాటు నేతలంతా ఈ డిమాండ్ నెరవేరాలని కోరుకుంటున్నారని చెప్పారు.
లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నది నీడ్ ఆఫ్ ది అవర్ అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నది సహేతుకమైన నిర్ణయమని తెలిపారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
Also Read: టీడీపీలో వైసీపీ కోవర్టులు.. ఖబడ్డార్.. నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను: చంద్రబాబు
పార్టీలో వినూత్న మార్పులకు మహానాడు ద్వారా శ్రీకారం చుట్టామని అన్నారు. నారా లోకేశ్ ప్రతిపాదించిన 6 శాసనాలు గేమ్ ఛేంజర్ కానున్నాయని తెలిపారు. తొలిరోజు మహానాడుకు అంచనాలకు మించి ప్రతినిధులు వచ్చారని చెప్పారు. మహానాడులో సాయంత్రం చేసే రాజకీయ తీర్మానానికి ప్రాధాన్యం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. లోకేశ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నది అందరి అభిమతమని అన్నారు. పార్టీ కోసం లోకేశ్ తెర వెనుక ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. లోకేశ్‌ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే ప్రతిపాదనను తాము అందరం కలిసి పార్టీ అధినేత ముందు పెడతామని తెలిపారు.