టీడీపీలో వైసీపీ కోవర్టులు.. ఖబడ్డార్.. నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను: చంద్రబాబు

"కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండండి. 2029లో ఇంతకంటే భారీ మెజారిటీ సాధించాలి" అని చంద్రబాబు చెప్పారు.

టీడీపీలో వైసీపీ కోవర్టులు.. ఖబడ్డార్.. నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను: చంద్రబాబు

Updated On : May 28, 2025 / 12:38 PM IST

టీడీపీలో వైసీపీ కోవర్టులు ఉన్నారని, తమతో ఉంటూ వాళ్ల టార్గెట్‌ను ఎలిమినేట్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వదిలిపెట్టనని అన్నారు.

“నేరస్తులూ ఖబడ్డార్.. నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. కోవర్టులను మన దగ్గరికి పంపి ఆ కోవర్టుల ద్వారా మీ ఎజెండా అమలు చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. వలస పక్షులు వస్తాయి.. పోతాయి.. నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండండి. 2029లో ఇంతకంటే భారీ మెజారిటీ సాధించాలి” అని చంద్రబాబు చెప్పారు.

Also Read: కమల హాసన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన డీఎంకే

“మనం అన్ని ప్రాంతాల్లో గెలవాలి. రాష్ట్రం అంతా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. అలాంటప్పుడు కొన్ని నియోజక వర్గాల్లో గెలిచి, కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు వస్తున్నాయంటే దానికి కారణం అక్కడ ఉండే నాయకత్వం. రాజకీయాల్లో ఉన్నాం.. రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాం.. అలాంటి సందర్భంలో మీరు కూడా ఆలోచించాల్సింది ప్రజలు మెచ్చే రాజకీయ పాలన గురించి.

దాన్ని మీ ప్రాంతాల్లో మీరు అందించవలసిన అవసరం ఉంది. ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉండాలి.. తోడుగా ఉండాలి. సమస్యలను పరిష్కరించే బాధ్యతను మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను.

ఈ కడప గడ్డలో చెప్తున్నా వివేకానంద రెడ్డి మర్డరు తర్వాత నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారు. గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయారంటే అందరి మాదిరిగా నేను కూడా నమ్మాను. ఆ తర్వాత నా మీదనే నెపం వేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యు ఇమాజిన్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నా.. అర్థమయిందా మీకు.. ఇప్పుడు నేను ఎవ్వరినీ నమ్మడం లేదు” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

“రూమంతా రక్తం ఉంటే.. కడిగేసి ఏమి జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయి అని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కరుడుగట్టిన నేరరస్తులతో రాజకీయం చేస్తున్నాం.

కొంతమంది మన దగ్గర ఉండి వాళ్లకు కోవర్టులుగా పనిచేస్తూ వాళ్ల ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యారాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్నునే పొడుచుకునేలా చేయాలనుకుంటున్నారు. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా.. ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా..

మీ అందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆమోదించండి. వలస పక్షలు వస్తాయి.. పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ బలోపేతం కావాలి.. అదే సమయంలో కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరి పై ఉంది. ఇది నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఎక్కడికక్కడ మనం అందరం కూడా ఆలోచించుకుని రాబోయే రోజుల్లో ఇంకా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతామని మీకు తెలియజేస్తున్నాను” అని తెలిపారు.