Iran vs US: పగటిపూటే ఇరాన్ పై విరుచుకుపడ్డ అమెరికా.. వచ్చే వారం మరింత భీకరంగా.. ట్రంప్ వార్నింగ్
శాంతి చర్చలకు టెహ్రాన్ సహకరించకపోతే, వచ్చే వారం నుంచి సైనిక దాడుల తీవ్రతను మరింత పెంచుతామని ట్రంప్(Iran vs US) స్పష్టం చేశారు.
US launches drone attack on Iran during the day.
- అమెరికా-ఇరాన్ యుద్ధ మేఘాలు
- పగటిపూటే ఇరాన్‌పై డ్రోన్ల దాడులు
- హెచ్చరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Iran vs US: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. శాంతి చర్చలకు టెహ్రాన్ సహకరించకపోతే, వచ్చే వారం నుంచి సైనిక దాడుల తీవ్రతను మరింత పెంచుతామని ట్రంప్ (Iran vs US)స్పష్టం చేశారు. సిచువేషన్ రూమ్‌లో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియా వేదికగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పగటిపూట విరుచుకుపడ్డ అమెరికా బలగాలు:
అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అమెరికా సైన్యం ఇరాన్‌పై పగటిపూట దాడులతో విరుచుకుపడింది. సాధారణంగా రాత్రి సమయాల్లో దాడులు చేసే యూఎస్ బలగాలు, ఈసారి వ్యూహాత్మకంగా పగటిపూటే ఇరాన్ లక్ష్యాలపై డ్రోన్లతో దాడి చేయడం గమనార్హం. హర్మూజ్ జలసంధి, ఇరాన్ తీర ప్రాంతాల్లోని టెహ్రాన్ సైనిక మౌలిక సదుపాయాలు, రక్షణ, క్షిపణి స్థావరాలే లక్ష్యంగా గ్రేటర్ తున్బ్ ద్వీపంపై ఈ దాడులు జరిగాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది.
నౌకల రక్షణే ధ్యేయంగా యూఎస్ వ్యూహం:
అంతర్జాతీయ జలాల్లో, ముఖ్యంగా హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఇరాన్ యొక్క సైనిక సామర్థ్యాలను, క్షిపణి నిల్వలను పూర్తిగా దెబ్బతీసి నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకే ఈ దాడులు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా తాజా చర్యలతో పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధం ముంచుకొచ్చేలా పరిస్థితులు మారాయి.
