అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న వివాదాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అవసరమైతే.. కశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్, భారత్ కు సాయం చేస్తామని ట్రంప్ చెప్పారు. అయితే సాయం ఏ రూపంలో చేస్తామనేది మాత్రం ట్రంప్ చెప్పలేదు. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో ట్రంప్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. అమెరికా-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు.
అదే సమయంలో కశ్మీర్ వివాదం గురించి ట్రంప్ ప్రస్తావించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, సాయం చేసేందుకు రెడీ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సాయం చేస్తామని ట్రంప్ చెప్పడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారం అని పదే పదే చెప్పింది. మూడో దేశం జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. అమెరికా సహా ఏ దేశం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పలు మార్లు స్పష్టం చేసింది. అయినా.. ట్రంప్.. పెద్దన్న పాత్ర పోషించేందుకు రెడీ అనడం చర్చకు దారితీసింది.
బీజేపీ ప్రభుత్వం.. కశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. వివాదాస్పద ఆర్టికల్ 370తో పాటు 35ఏ ని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆర్టికల్ 370 రద్దుని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. కశ్మీర్ ప్రజలకు అన్యాయం జరిగిందని గొంతు చించుకుంటోంది. భారత్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పాకిస్తాన్.. ఈ విషయంలో అమెరికా సాయం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఆర్టికల్ 370 జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తే ఆర్టికల్ 35ఏ కింద ఆ ప్రాంతానికి ప్రత్యేక హక్కులు లభించాయి. కశ్మీర్‌లో శాశ్వత నివాసులు ఎవరో నిర్ధారించే అధికారం ఆ రాష్ట్ర అసెంబ్లీకి దక్కింది. కాగా, 370, 35ఏ రద్దుతో జమ్మూకశ్మీర్‌లు విడిపోయి భారతదేశ అంతర్భాగంలో కలిసిపోయాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మూడు ముక్కలైంది. జమ్మూ, కశ్మీర్, లడాఖ్‌గా ఉనికిలోకి వచ్చాయి. జమ్మూ, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. లడాఖ్ మాత్రం కేంద్ర ప్రభుత్వ పాలన మాత్రమే ఉంటుంది. లడాఖ్‌కు అసెంబ్లీ లేదు. 1954 నాటి ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ 2019 ఆగస్టు 5న రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగంలోని అన్ని నిబంధనలూ జమ్మూ, కశ్మీర్, లడాఖ్ ప్రాంతాలకు వర్తించేలా ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
Also Read : ఇండియాలో 1% ధనవంతుల సొమ్ము 70% పేదల జీవితాలతో సమానం