Volkswagen Job Cuts : చైనా ఎఫెక్ట్.. సంక్షోభంలో ఫోక్స్‌వ్యాగన్.. లక్ష మంది ఉద్యోగాలు ఔట్! చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్
Volkswagen Job Cuts : సాఫ్ట్వేర్ రంగంలో వరుస లేఆఫ్స్‌తో ఉద్యోగులు ఆందోళన చెందుతున్న వేళ.. ఇప్పుడు ఆ ప్రభావం ఆటోమొబైల్ రంగానికీ పాకుతున్నట్లు కనిపిస్తోంది. లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు జర్మనీకి చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ సిద్ధమైంది.
Volkswagen Job Cuts
Volkswagen Job Cuts : సాఫ్ట్వేర్ రంగంలో వరుస లేఆఫ్స్‌తో ఉద్యోగులు ఆందోళన చెందుతున్న వేళ.. ఇప్పుడు ఆ ప్రభావం ఆటోమొబైల్ రంగానికీ పాకుతున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ దిగ్గజ కార్ల కంపెనీలు కూడా ఖర్చులు తగ్గించుకోవడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని సర్దుబాటు చేసుకోవడంకోసం ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఫోక్స్‌వ్యాగన్ భారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. దీంతో ఆటో రంగంలోనూ ‘లేఆఫ్స్’ కలకలం మొదలైంది.
జర్మనీకి చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ సంచలన నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమైంది. ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50వేల ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికను అమలు చేస్తోంది. తాజాగా మరో 50వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు మేనేజ్మెంట్, కార్మిక ప్రతినిధులు అంగీకరించారు. దీంతో ప్రస్తుత పునర్వ్యవస్థీకరణలో మొత్తం ఉద్యోగాల కోత 1 లక్షకు చేరింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 6.5 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉండగా.. ఈ కోత దాదాపు 15 శాతం సిబ్బందిపై ప్రభావం చూపనుంది. అయితే, ఈ కంపెనీకి సంబంధించి ఒక్క జర్మనీలోనే 43శాతం మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
ఫోక్స్ వ్యాగన్ ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చైనా ఆటో మొబైల్ కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ, చైనాలో వాహనాల అమ్మకాలు మందగించడం, అమెరికా దిగుమతి సుంకాలు, యూరప్‌లో అధిక ఉత్పత్తి సామర్థ్యం వంటి అంశాలు కంపెనీపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో అంచనాల మేరకు డిమాండ్ పెరగకపోవడం కూడా కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఖర్చులను తగ్గించుకొనేందుకు సంస్థ సిద్ధమైంది. లక్ష మంది ఉద్యోగులపై వేటు వేయడంతోపాటు.. ఖర్చులను తగ్గించి లాభదాయకతను పెంచేందుకు సంస్థ తన వాహనాల మోడల్ లైనప్‌ను కూడా భారీగా కుదించనుందని తెలుస్తోంది. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా మోడల్ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా తగ్గించి, ఎక్కువ డిమాండ్ ఉన్న, అధిక లాభాలు అందించే వాహనాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాలపై ఫోక్స్‌వ్యాగన్ సీఈఓ ఒలివర్ బ్లూమ్ మాట్లాడుతూ.. కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక భవిష్యత్‌కు బలమైన సంకేతమని పేర్కొన్నారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
