అన్ని పేజర్లు ఎలా పేలిపోయాయి? ఇది మొసాద్‌ గతంలో చేసిన ఆపరేషన్ల వంటిదేనా?

వాటి బ్యాటరీలను ఓవర్‌ హీట్ అయ్యేలా ఇజ్రాయెల్ హ్యాకింగ్ చేసి ఈ పేలుళ్లకు పాల్పడిందని కొందరు అంటున్నారు.

అన్ని పేజర్లు ఎలా పేలిపోయాయి? ఇది మొసాద్‌ గతంలో చేసిన ఆపరేషన్ల వంటిదేనా?

Updated On : September 18, 2024 / 1:35 PM IST

Pager explosions: పేజర్ల పేలుళ్లతో లెబనాన్‌ వణికిపోయిన విషయం తెలిసిందే. దీంతో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 2,800 మందికి పైగా గాయాలపాలయ్యారు. సెల్‌ఫోన్ల కంటే చిన్నగా ఉండే పేజర్లు అసలు ఎలా పేలిపోయాయి? సెల్‌ఫోన్లు తమకు సురక్షితం కాదని పేజర్లను వాడుతోంది ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా.

అయినప్పటికీ పేజర్లను పేల్చేసి అంతమందిని చంపి, గాయాలపాలు చేసిన అంతటి అత్యాధునిక టెక్నాలజీ ఇజ్రాయెల్ వద్ద ఉందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ పేరు మొసాద్‌. ఆ సంస్థే ఈ పేలుళ్లకు కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. అసలు పేజర్లు ఎలా పేలిపోయాయి? వాటి బ్యాటరీలను ఓవర్‌ హీట్ అయ్యేలా ఇజ్రాయెల్ హ్యాకింగ్ చేసి ఈ పేలుళ్లకు పాల్పడిందని కొందరు అంటున్నారు.

పేజర్లను తయారుచేసే సమయంలోనే లేదా తయారు చేసిన తర్వాత వాటిని రవాణా చేసినప్పుడు వాటిని ట్యాంపర్ చేసి ఉండొచ్చని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. బాంబులు వేయకుండా, యుద్ధ విమానాలతో దాడులు చేయకుండా సప్లయ్ చైన్ అటాక్స్ చేసిన తీరు ఆందోళన కలిగించేలా ఉంది. ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ సంబంధిత దాడులే జరిగాయి. హార్డ్‌వేర్ సప్లయ్ చైన్ అటాక్స్ మాత్రం చాలా అరుదుగా జరుగుతున్నాయి. లెబనాన్‌లో పేజర్ల పేలుళ్ల కోసం భారీ ఆపరేషనే చేపట్టినట్లు తెలుస్తోంది.

పేజర్లలో పేలుడు పదార్థాలు పెట్టారా?
హిజ్బుల్లా నేతలు తైవాన్ నుంచి దాదాపు 5 వేల పేజర్లను కొనుగోలు చేశారు. అంతకుముందే, పేజర్ల కొనుగోళ్ల విషయాన్ని అంచనా వేసిన మొసాద్ ఏజెంట్లు ఒక్కో పేజర్లలో 3 గ్రాముల చొప్పున శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని చేర్చినట్లు మరికొందరు నిపుణులు అంటున్నారు. ఈ కారణం వల్లే పేజర్లు అన్నీ బాంబుల్లా ఇప్పుడు పేలిపోయాయని అంటున్నారు.

గతంలో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్‌ పలు డేంజరస్ ఆపరేషన్లు చేసింది. వాటి ముఖ్యమైనవి ఆపరేషన్ ఫినాలె (1960), ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ (1973), ఆపరేషన్ సిరియా (1960-65), మిషన్ ఇరాన్ (2010 నుంచి). ఇప్పుడు లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ సీక్రెట్ ఆపరేషన్ ద్వారానే పేజర్ల పేలుళ్లకు పాల్పడిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Pagers Explode: పేజర్ల పేలుళ్ల కలకలం.. తొమ్మిది మంది మృతి, మరో 2,800 మందికి గాయాలు