మసీదుపై ఎగిరిన రుధిరపు జెండా : ఎందుకు అమెరికా- ఇరాన్ ఉద్రిక్తత భారత్ ఆర్ధిక వ్యవస్థకు చెడ్డ వార్త?

షియా ముస్లింలు పవిత్రంగా భావించే జంకారాన్ మసీదు గుమ్మటంపై ఎర్ర జెండా ఎగిరింది. నిజానికి కమ్యూనిస్టులో, మార్క్సిస్టులో, మావోయిస్టులో, లెనినిస్టులో ఎర్రజెండా పట్టుకుంటే అది విప్లవానికీ, చైతన్యానికీ, తిరుగుబాటుకూ, ధిక్కారానికీ, పోరాటానికీ సంకేతం.. అయితే షియా ముస్లింల మత విశ్వాసం ప్రకారం ఓ ప్రార్థనస్థలంపై ఎర్ర జెండా ఎగరేయడం అంటే అది ప్రతీకారానికీ, యుద్ధానికీ, శత్రువినాశనానికీ హెచ్చరిక.. అంటే అత్యంత అసాధారణ పరిస్థితిలో మాత్రమే అలా రుధిరపు(ఎరుపు) జెండాను ఎగరేస్తారు. పద్నాలుగు వందల ఏళ్లుగా ఎప్పుడూ ఇలా ఎర్రజెండా ఎగరేయలేదు.. అప్పుడెప్పుడో క్రీ.శ. 680లో కర్బాలా యుద్ధం సమయంలో ఈ జెండా ఎగిరింది.
ఎర్ర జెండా ఎగరవేయడం అంటే మామూలు విషయం ఏం కాదు. అమెరికాను సాతానుగా భావిస్తూ.. సై అంటూ యుద్ధానికి సిద్ధం కావటమే. ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేయడమే.. ప్రతీకారం తీరాకే జెండాను కిందకు దింపుతారు. అది షియా మతస్తుల ఆచారం.. నిజానికి ముస్లింలు వాడే జెండా పచ్చ జెండా. ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సొలేమాన్‌ను అమెరికా హతమార్చినప్పటి నుంచి పగతో రగిలిపోతున్న ఇరాన్.. అందుకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలోనే ఈ ఎరుపు జెండా ఎగురవేసింది. ఖాసిం సులైమానీ షియా ముస్లింలకు ఒకరకంగా అభిమాన నాయకుడు. నాలుగు దేశాల్లో అతను ఏది చెబితే అదే. ప్రపంచవ్యాప్తంగా తన మాట చెలామణీ ఉంది.
అటువంటి వ్యక్తి చనిపోవడంతో యావత్తు షియా ముస్లిం సమాజం అమెరికాపై ఎలా కత్తులు నూరుతుంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాలను అలర్ట్ చేశారు ట్రంప్. ఒక్క అమెరికన్ స్థావరంపై గానీ, అమెరికన్‌పై గానీ దాడి జరిగినా అమెరికా ప్రతీకారం కనీవినీ ఎరుగనంత తీవ్రంగా ఉంటుందనీ, మరింత బ్రాండ్ న్యూ ఎక్విప్‌మెంట్ పంపిస్తామని, ఏమాత్రం వెనకాడేది లేదని, 52 ఇరాన్‌కు ముఖ్యమైన స్థలాలను టార్గెట్ చేస్తున్నామని ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ అమెరికా, ఇరాన్ వైరం ఇప్పట్లో సమసిపోయే అవకాశం లేదు.
ఇదంతా పక్కనబెడితే సులైమానీ చనిపోవడం ఇండియాకు కూడా నష్టమే. అరాచక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌పై పోరాడే సులైమానీ ఇండియాకు పరోక్ష స్నేహితుడు. ఇరాన్‌తో ఇండియాకు ఉన్న మంచి సంబంధాల రీత్యా ప్రత్యక్ష స్నేహితుడు. కానీ అమెరికా అతను ఇండియాకు కూడా శత్రువే అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. మారిన పరిస్థితుల్లో పాకిస్థాన్‌ను కూడా ఇంకా దూరం చేసుకోకూడదని అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించేసి, పాకిస్థాన్‌కు మిలిటరీ శిక్షణను పునరుద్ధరించింది అమెరికా. ఈ క్రమంలో అమెరికా రెచ్చిపోయే కొద్దీ ఇండియా ఇరకాటంలో పడుతుంది.
అంతేకాదు ఈ పరిణామం ముడిచమురు మార్కెట్‌ను మండిస్తోంది. దాడి జరగడానికి ముందు అంతర్జాతీయ మార్కెట్లో బారెల్ ముడిచమురు ధర 68 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు 70 డాలర్లకు చేరింది. సహజంగా ముడిచమురు దిగుమతులపై ఆధారపడే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక శాపం. భారత్ ముడిచమురు దిగుమతుల్లో ఇరాన్ నుంచే 80 శాతం వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలుపెరగడంతో.. దాని భారం భారత ఆర్థికవ్యవస్థపైనా పడనుంది. ఫలితంగా ఎక్సైజ్ డ్యూటీలు, రిటైల్ ఆయిల్ ధరలు తగ్గించాలని ఒత్తిడి వచ్చే ప్రమాదం ఉంది. రెవెన్యూ తగ్గిపోయే పరిస్థితులు భారత ద్రవ్యలోటుపైనా ప్రభావం చూపిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2019-20వ సంవత్సరానికిగానూ భారత్ ద్రవ్యలోటు 3.3శాతంగా ఉంది. టాక్స్ వసూళ్లు తగ్గడం, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరే అవకాశం లేకపోవడంతో.. మరిన్ని సమస్యలు తప్పవు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 21 రూపాయలు, డీజిల్‌పై 16రూపాయలు వసూలు చేస్తోంది. 2019 సెప్టెంబర్‌లో కేర్ రేటింగ్ రిపోర్టు ప్రకారం ప్రభుత్వం 3 లక్షల కోట్లను పెట్రోలియం సెక్టార్ నుంచి రాబట్టగా.. అందులో 2 లక్షల 15 వేల కోట్లు కేవలం ఎక్సైజ్ డ్యూటీగానే వచ్చింది. ఇప్పుడు సంక్షోభం కారణంగా రూపాయివిలువ మరింతగా క్షీణించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.