Pilot loses Cool: రన్‌వే‌పైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!

గాట్విక్ ఎయిర్‌పోర్ట్ నుంచి సైప్రస్ లోని లార్నాకా వెళ్లాల్సిన విజ్ ఎయిర్(wizz air) W95749 విమానాన్ని ఏడూ గంటల పాటు రన్ వే పైనే నిలిపివేశారు గాట్విక్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.

Pilot loses Cool: రన్‌వే‌పైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!

Wizz Air

Updated On : May 27, 2022 / 7:35 PM IST

Pilot loses Cool: రోడ్డుపై గంట రెండు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుంటేనే వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటిది అనుకోని కారణాల వలన ఒక విమానం 7 గంటల పాటు రన్ వే పైనే నిలిచిపోయింది. సాధారణంగా ఇటువంటి ఆలస్య ఘటనల్లో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తుంటారు. కానీ ఇక్కడ..ఆ విమానం నడిపే పైలట్ కోపంతో ఊగిపోగా..అవాక్కవడం ప్రయాణికుల వంతైంది. వివరాల్లోకి వెళితే యూకేలోని గాట్విక్ ఎయిర్ పోర్ట్ గత కొన్ని రోజులుగా ప్రయాణికుల రద్దీతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వచ్చిపోయే విమానాలు గంటల తరబడి ఆలస్యం అవుతున్నాయి. ఈక్రమంలో గురువారం నాడు గాట్విక్ ఎయిర్‌పోర్ట్ నుంచి సైప్రస్ లోని లార్నాకా వెళ్లాల్సిన విజ్ ఎయిర్(wizz air) W95749 విమానాన్ని ఏడూ గంటల పాటు రన్ వే పైనే నిలిపివేశారు గాట్విక్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది. ఎయిర్ ట్రాఫిక్ నుంచి ఎంతకూ అనుమతి రాకపోవడంపై సహనం కోల్పోయిన విమాన పైలట్..గట్టిగా అరుస్తూ..”ఇక నా వల్ల కాదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. దిగిపోవాలనుకునే ప్రయాణికులు చేతులు పైకెత్తండి. మీరు దిగి వెళ్ళిపోతేగాని ఈరోజు మనం ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. అసలు ఇదంతా నాకు అవసరం లేదు. నా తోటి సిబ్బంది కూడా అవసరం లేదు. ఇక్కడి నుంచి బయటపడేందుకు నేను చేయాల్సిందంతా చేశాను. ఇప్పుడు పరిస్థితి నా చేతుల్లోనూ లేదు. మీరు దిగిపోతానంటే నిరభ్యంతరంగా దిగిపోండి” అంటూ పైలట్ అనౌన్స్ చేశాడు.

ఇది విన్న ప్రయాణికులు మొదట కాస్త అయోమయానికి గురైనా, పైలట్ పరిస్థితి తలుచుకుని నవ్వుకున్నారు. తమతో పాటుగా ఏడూ గంటల పాటు విమానంలోనే వేచి చూస్తున్న పైలట్ సహనం కోల్పోవడంలో తప్పు లేదంటూ పైలట్ కు వంత పాడారు. ఈ దృశ్యాన్ని విమానంలోని ఒక ప్రయాణికురాలు వీడియో తీయగా..అసహనానికి గురైన పైలట్ వ్యాఖ్యలు విని ప్రయాణికులు నవ్వుకున్నారు. ఇక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఇక ఈఘటనపై విజ్ ఎయిర్ సంస్థ స్పందిస్తూ..ప్రయాణికులకు, పైలట్ కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. గాట్విక్ ఎయిర్‌పోర్ట్ లో గత కొన్ని రోజులుగా నెలకొన్న రద్దీ పరిస్థితుల వలన ఈ సమస్య వచ్చినట్లు విజ్ ఎయిర్ తెలిపింది.

other stories:Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు