This Woman's Response To A Man Continuously Harassing Her
man continuously harassing her : బార్‌లో స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న యువతిని ఓ వ్యక్తి వెరిచేష్టలతో వేధించాడు. అతడికి దిమ్మతిరిగేలా బదులిచ్చింది ఆ యువతి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టిక్ టాక్ లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కల్లా అనే యువతి కూర్చొని ఉన్న కుర్చీని వెనుకవైపు నుంచి అతడు తాకేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనను వేధిస్తున్న అతడి చేష్టలను చూసి భరించలేక గట్టిగా బుద్ధిచెప్పింది. ఆమె వెనుక కుర్చీని మరింత దగ్గరగా అనించి కూర్చొన్నాడా వ్యక్తి.. అతన్ని దూరంగా వెళ్లమని మర్యాదాగా చెప్పి చూసింది. కానీ, అతడు వినలేదు. మళ్లీ ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. కావాలనే తన చేయిని ఆమె నడుంకు తగిలించి అయ్యో మళ్లీ నా చెయ్య తగిలిందిగా అంటూ వెర్రిచేష్టలతో విసిగించాడు.
అతడి చేష్టలతో విసిగిపోయి పక్కకి జరిగి దూరంగా కూర్చొంది. అమెకు దగ్గరగా కుర్చీని జరిపి మళ్లీ తాకడం మొదలుపెట్టాడు. దాంతో ఆ యువతికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఎడాపెడా మాటలతో వాయించేసింది. నాకు కుర్చీ తగిలిందని తెగ బాధపడిపోతున్నావా? నా లైఫ్ లో 30ఏళ్లుగా ఇలాంటివెన్నో భరించాను. నాతో నీలా అనుచితంగా ప్రవర్తించిన వారికి తగిన బుద్ధిచెప్పాను. నీకు కూడా అదే పరిస్థితి తెచ్చుకోకు జాగ్రత్త అన్నట్టుగా చివాట్లు పెట్టింది. ఇదంతా అక్కడి ఆమె స్నేహితుతు తన ఫోన్ లో వీడియో రికార్డు చేశాడు.
అనంతరం ఆ వీడియోను టిక్ టాక్ లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియోకు మహిళా శక్తి (Women Power) అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించారు. వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహిళ ధైర్యాన్ని అభినందిస్తున్నారు. ఆకతాయిల పట్ల యువతి చూపించిన తెగువను ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2 మిలియన్లకు పైగా మంది వీక్షించారు.