International Women’s Day 2024 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఆమె.. శక్తి స్వరూపిణి.. బాంధవ్యాలకు వారథి..!

Womens Day 2024 : సంసారంలో సరైనా మార్గంలో వెళ్లాలన్నా.. ఎన్నికష్టాలు వచ్చి నిలదొక్కుకుని నిల్చోవాలన్నా.. మహిళపాత్ర అనన్యం. మహిళ జన్మనే కాదు జీవితాన్నిస్తుంది.

International Women’s Day 2024 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఆమె.. శక్తి స్వరూపిణి.. బాంధవ్యాలకు వారథి..!

International Women's Day 2024

International Women’s Day 2024 : ఆమె.. శక్తి స్వరూపిణి. బాంధవ్యాలకు వారథి. రెప్పల చాటున కన్నీటి చుక్కలు దాచుకుని.. కుటుంబాన్ని నడిపే సారధి. తల్లిగా, కూతురుగా, తోబుట్టువుగా, భార్యగా అనురాగం, అప్యాయతలు పంచే ప్రేమమయి. ఆమె త్యాగం వెలకట్టలేనిది. ఇంటా, బయట వివక్ష, వేధింపులే బహుమానంగా ఇస్తున్నా అంతులేని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. అదే ఆమె స్థైర్యానికి చిహ్నం. ఆడదే ఆధారం. మన కథ ఆడనే ఆరంభం.. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం.. అంటూ సృష్టిలో మహిళ పాత్రను అద్భతంగా వర్ణించాడు ఓ కవి. సంసారంలో సరైనా మార్గంలో వెళ్లాలన్నా.. ఎన్నికష్టాలు వచ్చి నిలదొక్కుకుని నిల్చోవాలన్నా.. మహిళపాత్ర అనన్యం. మహిళ జన్మనే కాదు జీవితాన్నిస్తుంది.

Read Also : Mallanna Tala Paga : శ్రీశైలం మల్లన్న పాగా విశిష్టత.. మహాశివరాత్రి నాడు దర్శించుకోనున్న లక్షలాది మంది భక్తులు

అవసరమనుకుంటే జీవిత భారాన్ని మోస్తుంది. తాను పస్తులుండి బిడ్డల కడుపు నింపుతుంది. ఒక్కటేమిటి భారం మోసేది, బాధ్యతలు పంచుకునేది, త్యాగానికి సిద్ధపడేది ఒక్క మహిళ మాత్రమే. సూర్యోదయానికి ముందే స్త్రీ విధి నిర్వహణ స్టార్ట్ అవుతుంది. ఆమెకు అతిపెద్ద బాధ్యత పిల్లల పెంపకం. పిల్లలను బడికి పంపడం తొలి విధి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్యారేజీ ఉండదనో, స్కూలు బస్సు పోతుందనో భయం. పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే మిగిలిన పనులు చక్కబెట్టాలి. అందుకే సైకాలజిస్టులు గృహిణి పాత్ర కంటే ఉద్యోగ జీవితం మేలు అంటారు. సాధారణ గృహిణి నుంచి ప్రభుత్వాలను నడిపించగల సామర్థ్యం ఉన్న శక్తిగా మహిళ ఎదిగింది. రాజకీయాలు, క్రీడలు, పాలనా.. ఇలా ముఖ్యమైన అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు ఏ మాత్రం తీసుపోకుండా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది మహిళ.

మన సంప్రదాయం, ఆచారాలు, కట్టుబాట్లలో మహిళకు ప్రత్యేక స్థానం ఉన్నట్లే.. మహిళ దినోత్సవానికి కూడా పెద్ద చరిత్రే ఉంది. 1908 మార్చి 8న వేలాది వస్త్ర పరిశ్రమల కార్మికులు అమెరికా న్యూయార్క్‌లోని రడ్చర్‌స్వేర్‌ దగ్గర పెద్దఎత్తున నిరసన చేపట్టారు. 8గంటల పని దినం, పురుషులతో సమాన వేతనం, సురక్షితమైన వాతావరణ పరిస్థితులు, లింగ , జాతి, ఆస్థి, అర్హతల బేధం లేకుండా ఓటుహక్కు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మహిళా సారథ్యంలో కదం తొక్కిన ఆ నాటి ఉద్యమం ప్రాధాన్యం సంతరించుకుంది.

మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా :
ఈ ఉద్యమ తర్వాత 1911లో డెన్మార్క్‌కోపెన్‌హెగెన్‌లో జరిగిన రెండో అంతర్జాతీయ సోషలిస్ట్‌ మహిళల కాన్ఫరెన్స్‌లో మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలని తీర్మానించారు. నాటినుంచి అనేక దేశాలు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. మన దేశంలో మొదటిసారిగా 1943 మార్చి 8న ముంబైలో బొంబాయి సోవియట్‌ మిత్రమండలి మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. నాణానికి ఒకవైపు మహిళ కష్టం, పట్టుదల క్రమశిణ ఉంటే..మరోవైపు వివక్ష, అడుగడుగునా ఇబ్బందులు ఉన్నాయి. బాల్యం నుంచే స్ర్తి ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. చిన్నప్పుడు ఆడపిల్ల ఆనే వివక్ష, యవ్వనంలో ఆకతాయిలు, పోకిరీల సమస్య, ఉద్యోగ జీవితంలో లైంగిక వేధింపులు, పెళ్లాయాక్కైనా ఆమె జీవితానికి ఆసరా లభిస్తుందనుకుంటే అక్కడా ఇబ్బందులు పడేవారే అధికం.

అత్తింటి గొడవలు, భర్త వరకట్న వేధింపులు.. ఇలా ఎన్నో సమస్యలు వెన్నంటే నడుస్తుంటాయి. ఇంటిల్లిపాదికి బండెడు చాకిరీ చేసినా సమయానికి అల్పాహారం తీసుకునే పరిస్థితి కూడా చాలామందికి ఉండదు. దీంతో అనారోగ్య సమస్యలు వెన్నంటే ఉంటాయి. కనీసం మధ్యాహ్నమైనా సమయానికి తింటుందా అంటే ఆ అవకాశం కూడా ఉండటం లేదు. ఇంటిపని, ఆఫీస్ పని చేసుకునే మహిళలు తమకు తెలియకుండానే ఓ రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. దాదాపు 80శాతం మంది మహిళలది ఇదే పరిస్థితి అన్నది నిపుణుల మాట.

ఆరోజే అసలైన మహిళా దినోత్సవం :
స్త్రీ అంటే చులనక భావం పోయిన రోజే ఆమెకు అసలైన మహిళా దినోత్సవం. ఆమె విలాస వస్తువు కాదు, ఇంటి యంత్రం అసలే కాదు. ఆమె అభిప్రాయానికే విలువ ఇవ్వాల్సిందే. ఆమె సూచన పట్టించుకుంటేనే భవిష్యత్ బంగారు బాట అవుతుంది. ఆమె ఇష్టాయిష్టాలకు గౌరవం దక్కిన చోటే అంతా బాగుంటుంది. ఇది మగువ అభిప్రాయమే కాదు.. నిజ జీవితంలో వాస్తవం. ఎన్ని ఆటుపోట్లు ఉన్నా వెరవని ధైర్యంతో ముందుకు సాగుతోంది మహిళ. గతంలో కంటే మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం పెరిగింది. వారికిస్తున్న ప్రాధాన్యత సానుభూతితోనే మరేదో కాదు. ఓపిక, పట్టుదల, పనితీరు మహిళలను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలబెడుతున్నాయి. వివక్షను పాతాళానికి తొక్కి ఉవ్వెత్తున గంగాలా ఎగిసి పడి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఆమె. రాజకీయ రంగమైనా.. విద్యారంగమైనా, పాలనలో అయినా.. ఉద్యోగ పరంగానైనా వారికి వారే పోటీ.

ఒకప్పుడు అన్నిరంగాల్లో పురుషులతో పోరాడిన మహిళలకు ఇప్పుడు అన్నిరంగాల్లో మగువలే పోటీ అవుతున్నారు. అంతలా స్త్రీలు గడపదాటి బయటికి వచ్చి తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. 20ఏళ్ల కింద వరకు స్త్రీ బయటికి వెళ్తే.. వివక్ష, అణిచివేత, చిన్నచూపు ఎదుర్కునేది. కాలం మారింది. పరిస్థితులు మారుతున్నాయి. జనాల ఆలోచన తీరులోనూ మార్పు వస్తుంది. స్త్రీ, పురుష సమానత్వం ఇప్పటికే చాలా రంగల్లో వచ్చేసింది. ఒకప్పుడు ఉద్యోగం చేసే మహిళంటే చిన్నచూపు చూసే పరిస్థితి నుంచి..వర్కింగ్ ఉమెన్ అంటే గౌరవం ఇచ్చేస్థాయికి వెళ్లింది ఆమె పట్టుదల.

Read Also : Part Time Job Offers : పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఘరానా మోసం.. 17లక్షలు పోగొట్టుకున్నాడు