Part Time Job Offers : పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఘరానా మోసం.. 17లక్షలు పోగొట్టుకున్నాడు

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్స్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 30 సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

Part Time Job Offers : పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఘరానా మోసం.. 17లక్షలు పోగొట్టుకున్నాడు

Part Time Job Offers Scam

Part Time Job Offers : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మోసాలతో జనాల డబ్బు దోచేస్తున్నారు. అమాయకులను, ఆర్థిక అవసరాలు ఉన్న వారిని టార్గెట్ చేసి సర్వం దండుకుంటున్నారు. తాజాగా పార్ట్ టైమ్ జాబ్ పేరుతో కొత్త మోసానికి తెరలేపారు. పార్ట్ టైమ్ జాబ్ చూపిస్తామని, వేలకు వేలు సంపాదించొచ్చని ఆశ పెడతారు. కట్ చేస్తే.. ఉన్నది కూడా ఊడ్చేస్తారు.

నవీ ముంబైలో పార్ట్ టైమ్ జాబ్ పేరుతో చేసిన మోసం వెలుగుచూసింది. పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్స్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 30 సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

కొల్హాపూర్ కి చెందిన సాగర్ జగన్నాథ్ (39), కుమార్ విష్ణు చవాన్ (44) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాగర్ రైతు కాగా, చవాన్ రియల్ ఎస్టేట్ ఎజెంట్. పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ పేరుతో 17లక్షలు దోచుకున్నారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.

”సాగర్, చవాన్ నన్ను వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యారు. పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ గురించి చెప్పారు. సులువైన టాస్క్ లు చేస్తే చాలు భారీ మొత్తంలో డబ్బు అందుతుందని వారు నాతో చెప్పారు. దాంతో నేను వారిని సంప్రదించాను. జాబ్ సంగతి దేవుడెరుగా.. నా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు కూడా దోచుకున్నారు. 17 లక్షల 76వేలు దండుకున్నారు. నేను మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాను” అని బాధితుడు వివరించాడు.

ఆ ఇద్దరు కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు. 30 కేసుల్లో వారి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు నిందితుల్లో ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాలో 10లక్షలు రూపాయలు ఉన్నాయని, ఆ ఖాతాను ఫ్రీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. డబ్బు కోసం ఆశపడితే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

Also Read : నిజాంపేట ఘటన మరకముందే.. ఇళ్లలోకి చొరబడిన ముగ్గురు దుండగులు