World Humanitarian Day 2023
World Humanitarian Day 2023 : ఇతరులకు సాయం చేయడమే జీవిత పరమావధిగా భావించినవారు ఉన్నారు. ఇతరులకు సాయం చేయడం కోసం జీవితాల్ని త్యాగం చేసిన వారున్నారు. ఇతరులకు సాయం చేస్తూ ప్రాణాలు అర్పించిన వారున్నారు. ఒకరు కష్టంలో ఉన్నారన్నా, ప్రమాదంలో ఉన్నారన్నా వారికి సాయం అందించాలంటే గొప్ప మనసుండాలి. అలాంటి మనసున్న మహనీయులందరినీ ఈరోజు గుర్తు చేసుకుందాం. ఈరోజు ‘ప్రపంచ మానవతా దినోత్సవం’.
ప్రపంచ మానవతా దినోత్సవం నిర్వహించడం వెనుక చరిత్ర ఉంది. ఆగస్టు 19, 2003 ఇరాక్‌లోని బాగ్దాద్‌లోని కెనాల్ హోటల్‌పై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాక్ సెక్రటరీ జనరల్ సెర్గియో వియెరా డిమెల్లో UN ప్రతినిధితో సహా 22 మంది మానవతావాద సహాయక సిబ్బంది చనిపోయారు. ఈ విషాద సంఘటనకు గుర్తుగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆగస్టు 19 న ‘ప్రపంచ మానవతా దినోత్సవం’గా ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా ప్రపంచ మానవతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘ఏది ఏమైనా’ (no matter what) అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సేవే పరమావధిగా ముందుకు వెళ్లడమే లక్ష్యమని ఈ థీమ్ సూచిస్తోంది.
తోటివారికి సాయపడమని మన పెద్దలు చెబుతారు. రోడ్డు ప్రమాదం జరిగినా.. ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నా.. రోడ్డుపై పెద్దవారు దాటలేని పరిస్థితుల్లో ఉన్నా పట్టించుకోకుండా వెళ్లిపోవడం మానవత్వం అనిపించుకోదు. ఆ సందర్భంలో మనకి వీలైనంత సాయం చేయడం ధర్మంగా భావించాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం జీవితాన్ని అర్పించిన మదర్ థెరిసాలాంటి మహనీయులెందరో మనకు స్ఫూర్తిగా నిలిచారు. వారిని ఆదర్శంగా తీసుకుని మనవంతు మానవత్వం చాటుకోవాలి.
74-year-old Hasan Ali Story : 74 ఏళ్ల రుమాళ్ల వ్యాపారి హసన్ అలీ స్ఫూర్తివంతమైన కథనం చదవండి
కరోనా మహమ్మారి ప్రపంచానికి ఎంతో కీడు చేస్తూనే గొప్ప గుణపాఠం నేర్పింది. ప్రతి ఒక్కరిలో సేవాగుణం అలవడింది. ఆ సమయంలో వైద్యులు, నర్సులు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు సామాన్యులు సైతం సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టడంలో తమవంతు సాయం అందించారు. వారందరి సేవలు అమూల్యం.
ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది మానవతావాదులను గుర్తించి వారిని గౌరవిస్తారు. ఎంతో మంది ప్రాణాలు పణాలు పెట్టిన వీరులకు నివాళులు సమర్పిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా విపత్తుల బారిన పడిన ప్రాంతాలకు సైతం వెళ్లి ప్రజల ప్రాణాలను రక్షించడానికి కృషి చేస్తున్న మానవతావాదులకు సెల్యూట్ చేద్దాం. వీలైనంతలో మన తోటివారికి సాయం చేద్దాం.