Finland : వలసదారులకు ఫిన్లాండ్ ఆహ్వానం

ప్ర‌పంచంలోనే అత్యంత సంతోష‌క‌ర‌మైన దేశంగా పేరుపొందిన ఫిన్లాండ్..ప్ర‌పంచ దేశాల నుంచి వలసలకు ఆహ్వానం ప‌లుకుతోంది.

Finland : వలసదారులకు ఫిన్లాండ్ ఆహ్వానం

Finland

Updated On : June 22, 2021 / 11:19 PM IST

Finland ప్ర‌పంచంలోనే అత్యంత సంతోష‌క‌ర‌మైన దేశంగా పేరుపొందిన ఫిన్లాండ్..ప్ర‌పంచ దేశాల నుంచి వలసలకు ఆహ్వానం ప‌లుకుతోంది. 55 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న ఫిన్లాండ్..ఇప్పుడు ఇమ్మిగ్రేష‌న్ నిబంధ‌న‌ల‌ను సులభ‌త‌రం చేస్తోంది. ప్రస్తుతమున్న ఇమ్మిగ్రేష‌న్ స్థాయిని రెట్టింపు చేసి ఏడాదికి 20 వేల నుంచి 30 వేల మందికి ఆహ్వానం ప‌లకాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కారణం ఇక్కడ రోజురోజుకూ ప‌ని చేసే వారి సంఖ్య త‌గ్గిపోవడమే.

ఎక్కువ జ‌నాభా వృద్ధి లేని స‌మ‌స్య‌తో ఫిన్లాండ్ స‌త‌మ‌త‌మ‌వుతోంది. దీనివ‌ల్ల దేశంలో రోజురోజుకూ ప‌ని చేసే వారి సంఖ్య త‌గ్గిపోతోంది. ప్ర‌తి 100 మంది ప‌ని చేసే వాళ్ల‌లో 39.2 మంది 65 ఏళ్ల‌కుపైబ‌డిన వాళ్లే అంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌పంచంలో జ‌పాన్ త‌ర్వాత ఆ స్థాయిలో వృద్ధ జ‌నాభా స‌మ‌స్య ఎదుర్కొంటున్న దేశం ఫిన్లాండే. 2030 క‌ల్లా ఈ దేశంలో వృద్ధుల జ‌నాభా 47.5 శాతానికి చేరుతుంద‌ని ఓ అంచ‌నా.

వాస్తవానికి ఇక్కడి ప్ర‌జ‌ల్లో వ‌ల‌స వ‌చ్చే వారిపై ఉన్న వ్య‌తిరేక‌తే ఫిన్లాండ్ కొంప ముంచుతోంది. బ‌య‌ట వాళ్ల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డానికి ఇక్క‌డి కంపెనీలు కూడా అంత సులువుగా అంగీక‌రించ‌వు. ఎలాగోలా ఇక్క‌డి కంపెనీల అవ‌స‌రాల‌ను తీర్చే ఉద్యోగులు బ‌య‌టి దేశాల నుంచి వ‌చ్చినా.. వాళ్లు ఎక్కువ కాలం అక్క‌డ ఉండ‌టం లేదు. ఖ‌ర్చు ఎక్కువగా ఉండ‌టం, మ‌రీ చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణం, చాలా క‌ష్టంగా ఉండే అక్క‌డి భాష వంటి అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి.

అయితే త‌మ జ‌నాభా, వ‌ర్క్‌ఫోర్స్ స‌మ‌స్య తీవ్ర‌త ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ఫిన్లాండ్‌..త‌మ విధానాల్లో మెల్ల‌గా మార్పులు తీసుకొస్తోంది. కేవ‌లం స్థానికుల‌కే ఉద్యోగాలు ఇవ్వాల‌న్న అక్క‌డి కంపెనీలు కూడా ఇప్పుడు విదేశీ వ‌ర్క‌ర్ల కోసం చూస్తున్నాయి. ముఖ్యంగా ఏషియా నుంచి వ‌ల‌స‌లు పెరగాల‌ని ఫిన్లాండ్ ఆశిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి వెళ్లిపోయిన త‌ర్వాత త‌మ దేశానికి వ‌ల‌స‌లు పెరుగుతాయ‌ని ఫిన్లాండ్ ఆశిస్తోంది. కాగా,ఇక్క‌డి జీవ‌న ప్ర‌మాణాలు, స్వేచ్ఛ‌, లింగ స‌మాన‌త్వం, అతి త‌క్కువ అవినీతి, త‌క్కువ నేరాలు త‌క్కువ కాలుష్యం.. ఫిన్లాండ్‌ను అత్యంత సంతోష‌క‌ర‌మైన దేశంగా మార్చాయి.

కాగా, నాలుగేళ్ల నుంచి ఫిన్లాండ్ వ‌రుస‌గా ప్ర‌పంచంలోనే అత్యంత సంతోష‌క‌ర‌మైన దేశంగా నిలుస్తూ వ‌స్తోంది. ఇక్క‌డి జీవ‌న ప్ర‌మాణాలు,స్వేచ్ఛ‌,లింగ స‌మాన‌త్వం, అతి త‌క్కువ అవినీతి, త‌క్కువ నేరాలు, త‌క్కువ కాలుష్యం ఫిన్లాండ్‌ను అత్యంత సంతోష‌క‌ర‌మైన దేశంగా మార్చాయి.