మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

ABVP activists block Minister KTR’s convoy : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి కేటీఆర్ వస్తున్నారని తెలుసుకున్న కార్యకర్తలు పక్కా ప్లాన్‌తో మంత్రి వాహనాన్ని అడ్డుకున్నారు. తమ ఊర్లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఒక కుల సంఘం భవనం ప్రారంభించిన తర్వాత కేటీఆర్ తన పర్యటన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏబీవీపీతోపాటు బీజేపీ శ్రేణులంతా కేటీఆర్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఏబీవీపీ కార్యకర్తలందరూ మంత్రి కాన్వాయ్ కు ఎదురుగా వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏబీవీపీతోపాటు బీజేపీ శ్రేణులను కూడా అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.
దీంతో స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారంతా పీఎస్ కు వెళ్లి ఎందుకు అరెస్టు చేశారని, నిరసన తెలుపడం తప్పా అని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డిపేట రహదారిపై రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలిపారు.