ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కంట్రోల్ రూమ్- చనిపోయిన పక్షులను ప్రొటోకాల్ ప్రకారం పూడ్చిపెట్టాలని ఆదేశం

Bird flu control room set up in Delhi : భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న బర్డ్ ఫ్లూ మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడింది. ఈ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే పెద్ద భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లుకూడా ఈ వైరస్ కు గురై మృత్యువాతపడుతున్నాయి.
బర్డ్ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పక్షులు అనుమానాస్పద స్థితిలో చనిపోతే సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై పర్యవేక్షణకు ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. చనిపోయిన పక్షులను ప్రొటోకాల్ ప్రకారం పూడ్చిపెట్టాలని ఆదేశించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించింది.
కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) ఉంది. భారతదేశంలో తొలిసారిగా 2006లో బర్డ్ ఫ్లూ గుర్తించారు. దేశంలో ఇది పక్షుల నుంచి మనుషులకు సోకిన దాఖలాలు లేవు. పౌల్ట్రీ ఉత్పత్తుల ద్వారా మనుషులకు సోకినట్టు ఆధారాలు కూడా లేవు. బయో సెక్యూరిటీ విధానాలు, వ్యక్తిగత పరిశుభ్రత, డిసిన్ఫెక్షన్ ప్రొటోకాల్స్ సహా వండే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు. వలస పక్షుల కారణంగా చలికాలంలో వైరస్ దేశంలోకి వ్యాప్తి చెందుతోంది.
సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ఈ తరహా వైరస్ పక్షుల్లో సోకుతుంది. ఈ నేపథ్యంలో ప్రతియేడాది ఈ సమయంలో కేంద్రం అప్రమత్తం చేస్తూ వస్తోంది. తాజాగా 4 రాష్ట్రాల్లో 12 బర్డ్ ఫ్లూ ఎపిసెంటర్లను గుర్తించిన కేంద్రం. రాజస్థాన్‌లో బారన్, కోటా, జాలావాడ్ ప్రాంతాల్లో కాకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగే మధ్యప్రదేశ్‌లో మంద్‌సౌర్, ఇండోర్, మాల్వా ప్రాంతాల్లో కాకులపై ప్రభావం పడింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్డా లోయలో వలస పక్షులపై ప్రభావం పడింది. కేరళలో కొట్టాయం, అలప్పుజలో పౌల్ట్రీ పరిశ్రమపై వైరస్ ప్రభావం ఉన్నట్లు కేంద్రం గుర్తించింది.