మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం – 5 నెమళ్లు మృతి

మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం – 5 నెమళ్లు మృతి

Updated On : January 9, 2021 / 11:47 AM IST

Five peacocks found dead in medak forest area : తెలంగాణ రాష్ట్ర ప్రజలను బర్డ్ ఫ్లూ భయం వీడటం లేదు. ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లాలో నాటు కోళ్లు మృతి చెందిన ఘటన మరువక ముందే మెదక్ జిల్లాలో ఒకేసారి అయిదు నెమళ్లు మరణించటం కలకలం రేపింది.

ఇప్పటికే కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాల్లో విస్తరించిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలంగాణ లో కూడా విస్తరిస్తోందనే భయం ప్రజలను వణికిస్తోంది. తాజాగా మెదక్ జిల్లా పాపన్న పేట శివారు అటవీ ప్రాంతంలో అయిదు నెమళ్లు మత్యువాత పడ్డాయి. కుళ్లిన స్థితిలో ఉన్న వాటి మృత కళేబరాలను పశువుల కాపరి గుర్తించాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వెంకటేశ్వర గుట్ట ప్రాంతంలో చనిపోయి.. కుళ్లిన స్థితిలో ఉన్న నెమళ్లను గుర్తించిన పశువుల కాపరి.. ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చాడు. నెమళ్లు చనిపోవటంతో స్థానికంగా ప్రజల్లో బర్డ్‌ఫ్లూ భయం పట్టుకుంది. స్థానిక పశుసంవర్థక అధికారి మాత్రం అజీర్ణంతో నెమళ్లు చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు.

కోడి మాంసం, గుడ్లు వాడకంపై వదంతులు వ్యాపించకుండా చూడాలని కేంద్రం అన్ని రాష్ట్రాలనూ కోరింది. బర్డ్ ఫ్లూ భయంతో తెలంగాణ రాష్ట్రంలో చికెన్ అమ్మకాలు 30 శాతం తగ్గాయని పౌల్ట్రీ వ్యాపారులు చెపుతున్నారు. అయితే ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారించబడలేదని అధికారులు తెలిపారు. దీనినుంచి బయటపడటానికి కార్యాచరణ ప్రణాళిక రూపోందించాలని ఇప్పటికే కేంద్రం బర్డ్ ఫ్లూ వ్యాపించినరాష్ట్రాలను కోరింది.