ఈసారి టీడీపీని వదిలేసి బీజేపీకి షాక్ ఇచ్చిన వైసీపీ

ఈసారి టీడీపీని వదిలేసి బీజేపీకి షాక్ ఇచ్చిన వైసీపీ

Updated On : March 1, 2021 / 7:28 PM IST

bjp candidates join ysrcp: శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. అయితే ఈసారి టీడీపీకి కాకుండా బీజేపీకి షాక్ ఇచ్చింది వైసీపీ. బీజేపీ తరుఫున నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు వైసీపీ గూటికి చేరారు. మంత్రి సీదిరి అప్పల్రాజు సమక్షంలో ఆ ఇద్దరు వైసీపీ కండువా కప్పుకున్నారు. 21వ వార్డు అభ్యర్థి దేవరశెట్టి బాలాజీ గుప్తా వైసీపీలో చేరిపోయారు. అలాగే 26 వార్డు బీజేపీ అభ్యర్థి మళ్లా రమ్య ఫ్యాన్ గూటికి చేరారు. రెండు రోజుల క్రితం టీడీపీ తరుఫున నామినేషన్లు వేసిన నలుగురు అభ్యర్థులు వైసీపీలో చేరారు.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ జోరుగా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నారు అధికార పార్టీ నేతలు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను గెలిచి మున్సిపల్ ఛైర్మన్ కుర్చీని కైవసం చేసుకునేందుకు మంత్రి సీదిరి అప్పలరాజు వేగంగా పావులు కదుపుతున్నారు. మొన్న టీడీపీ నుంచి నలుగురు కౌన్సిలర్ అభ్యర్ధులను వైసీపీలో చేర్చుకుని టీడీపీకి షాక్ ఇచ్చిన మంత్రి.. తాజాగా బీజేపీ తరఫున నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులను వైసీపీలో జాయిన్ చేసేసుకుని కమలం పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు.

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులకు గాను 135 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 9 వార్డులకు బీజేపీ నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఇద్దరిని వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో లాగేయడంతో ఇప్పుడు మిగతా అభ్యర్ధులు ఉంటారా లేక వారూ జెండా పీకేస్తారా అనే చర్చ జరుగుతోంది.