ఆటోలో మర్చిపోయిన రూ.20లక్షల విలువైన నగల్ని తిరిగి ఇచ్చేసిన డ్రైవర్

ఆటోలో మర్చిపోయిన రూ.20లక్షల విలువైన నగల్ని తిరిగి ఇచ్చేసిన డ్రైవర్

Updated On : January 29, 2021 / 2:25 PM IST

Chennai auto driver honesty : ఆటో డ్రైవర్లంటే ర్యాష్ గా ఉంటారని అనుకుంటాం. కానీ ఎంతోమంది ఆటో డ్రైవర్ల నిజాయితీ గురించి విన్నాం. అటువంటి ఆటో డ్రైవరే శరవణకుమార్. తన ఆటో ఎక్కి బంగారు సంచిని మర్చిపోయి వెళ్లిపోయిన ప్యాసింజర్ కు తిరిగి ఆ బంగారం బ్యాగును తిరిగి అప్పగించేసిన నిజాయితీపరుడు శరవణకుమార్.

చెన్నై క్రోంపేట సమీపంలో ఆటో నడిపే శరవణకుమార్ ఆటోను గురువారం (జనవరి 28)న క్రోంపేటకు చెందిన ఆల్‌బ్రైట్‌ వ్యాపారుల సంఘం నేత ఎక్కాడు. అతనితో పాటు ఓ బ్యాగు కూడా ఉంది. గురువారం ఉదయం క్రోంపేటలోని ఓ చర్చిలో అతని కూతురు వివాహం జరుగనుంది. దీన్ని పురస్కరించుకుని సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో బంగారం నగలు ఉన్న బ్యాగుతో ఆటోలో బయలుదేరిని సదరు వ్యాపారి శరవరణకుమార్ ఆటో ఎక్కాడు. కొద్ది సేపటికి తన ఇల్లు రాగానే మిగతా లగేజ్ అంతా తీసుకున్నాడు గానీ నగల బ్యాగ్ ఆటో మర్చిపోయి దిగి వెళ్లిపోయాడు. శరవణకుమార్ కూడా ఆటో చార్జీలు తీసుకుని వెళ్లిపోయాడు.

ఇంటికి వెళ్లిన తరువాత నగల సంచి కనబడకపోవడంతో ఆల్‌బ్రైట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆటో బ్యాక్ సీట్లో నగల సంచి ఉండడం గమనించిన 30 ఏళ్ల ఆటో డ్రైవర్‌ శరవణకుమార్‌ ఆ నగల బ్యాగు తీసుకుని క్రోంపేట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు.

నగలను పోలీసు లు సరి చూసి ఆల్‌బ్రైట్‌ నిర్ధారణ చేసిన తరువాత అతని చేతికి అందించారు. ఆ బ్యాగులో 50 సవర్ల నగలు సురక్షితంగా ఉన్నాయని గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్ నిజాయితీని ప్రశంసించారు. ఆ నగల విలువ రూ.20లక్షలు ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఆ బ్యాగును ఓ వ్యక్తి తన ఆటోలో మరచిపోయాడని ఫలానా ప్రాంతంలో దిగాడని చెప్పాడు. అతని ఫోన్ నంబర్ నాదగ్గర లేకపోవటంతో పోలీస్ స్టేషన్ లో అప్పగించానని చెప్పాడు.