చైనా సైనికులు 40 మందికిపైగా చనిపోయారు

లద్దాఖ్ లోని గాల్వన్‌లో జూన్ 15న చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. వెంటనే

  • Published By: naveen ,Published On : June 21, 2020 / 05:22 AM IST
చైనా సైనికులు 40 మందికిపైగా చనిపోయారు

Updated On : June 21, 2020 / 5:22 AM IST

లద్దాఖ్ లోని గాల్వన్‌లో జూన్ 15న చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. వెంటనే

లద్దాఖ్ లోని గాల్వన్‌లో జూన్ 15న చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ కూడా ఎదురు దాడికి దిగింది. ఈ హింసాత్మక ఘర్షణలో మన జవాన్లు 20మంది అమరులయ్యారు. అయితే.. చైనా తరఫున జరిగిన ప్రాణ నష్టమెంత అనేదానిపై ఇప్పటివరకు చైనా నోరు మెదపలేదు. అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అఫీషియల్ గా స్టేట్ మెంట్ రాలేదు. కాగా, తొలిసారిగా భారత ప్రభుత్వం ఆ లెక్కను తేల్చింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కు చెందిన 40 మందికి పైగా సైనికులను చైనా కోల్పోయిందని కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధికారి జనరల్‌ వీకే సింగ్‌ తెలిపారు. చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనే విషయంపై ప్రభుత్వం తరఫున స్పందించడం ఇదే తొలిసారి.

సైనికుల మరణాలను చైనా దాచి పెట్టింది:
1962 భారత్‌-చైనా యుద్ధంలో కూడా ఆ దేశం తమ సైనికుల మరణాలను దాచిపెట్టిందని వీకే సింగ్ విమర్శించారు. శనివారం(జూన్ 20,2020) ఆయన ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గాల్వన్ లోని సైనిక పోస్టు-14 భారత్‌ అధీనంలోనే ఉందన్నారు. నిర్బంధించిన కొందరు భారత సైనికులను చైనా విడుదల చేసిందనే వార్తలపై ఆయన స్పందించారు. ‘‘మన భూభాగంలోకి వచ్చిన చైనా సైనికులను మనవాళ్లు కూడా నిర్బంధించారు. ఆ తర్వాత వారిని విడుదల చేశాం’’ అని చెప్పారు.

జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఏంటంటే:
వాస్తవాధీన రేఖ దగ్గర ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణ నష్టం సంభవించడం గత 45ఏళ్లలో ఇదే తొలిసారి. భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీయడానికి టెంట్‌ దగ్గర జరిగిన గొడవే కారణమని సమాచారం. వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్‌ ఏర్పాటు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 అనే చోట చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) టెంట్‌ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. జూన్ నెల ప్రారంభంలోనే ఈ టెంట్‌ వేశారు.

కల్నల్ సహా 20మంది వీర మరణం:
గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్‌ కమాండర్‌ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. జూన్‌ 6న భారత్‌, చైనా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ర్యాంకు అధికారుల మధ్య జరిగిన సమావేశంలో టెంట్‌ తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు దొంగ దాడికి దిగారు. మనవాళ్లపై రాళ్లు విసరడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇనుప తీగలు చుట్టిన రాడ్లతో దాడి చేశారు. ఆరు గంటలపాటూ జరిగిన తోపులాటలో పక్కనే ఉన్న గాల్వన్‌ లోయలో కూడా కొందరు సైనికులు పడిపోయారు. ఎముకలు కొరికే చలి, హైపోథెర్మియాతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 

భారత జవాన్ల ఎదురుదాడితో బిత్తరపోయిన చైనా ఆర్మీ:
ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 గాల్వన్, ష్యోక్‌ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో క‌ల్న‌ల్ సంతోష్ బాబు స‌హా 20 మంది భార‌త సైనికులు అమరులయ్యారు. భారత సైనికుల నుంచి అనూహ్యంగా తీవ్రమైన ప్రతిఘటన ఎదురవడంతో చైనా సైనికులు కంగుతిన్నారు. భారత జవాన్ల పరాక్రమాన్ని కళ్లారా చూసి బిత్తరపోయారు. తప్పు చేయడమే కాకుండా తీవ్రంగా దెబ్బతింది చైనా ఆర్మీ. అందుకే, చైనా సైనికుల మరణాల గురించి ఆ దేశం స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

సైనికుల త్యాగం వృథా కానివ్వం:
చైనా కావాలనే తరచూ వాస్తవాధీన రేఖను దాటుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రస్తుత పరిస్థితిపై తాము పూర్తి అంచనాతో ఉన్నామని, ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని రక్షణశాఖ తెలిపింది. సైనికుల ప్రాణ త్యాగాన్ని వృథా కానివ్వమని ప్రధాని మోడీ ఇప్పటికే దేశానికి హామీ ఇచ్చారు. గాల్వన్ లోయలో ఎలాంటి చర్యలకైనా భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని భారత వాయు సేన(ఐఏఎఫ్‌) ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియా చెప్పారు. గాల్వన్ ఘటన ఫలితం త్వరలోనే చూస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు:
శత్రు దేశ ట్యాంకర్లను ఛిద్రం చేయగల.. ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్‌ అపాచీ, సరికొత్త రాడార్‌ సాంకేతికతతో కూడిన.. మిగ్‌-29 ఫైటర్‌ జెట్‌లు, సత్వరమే ఆయుధాలను చేరవేసే చినూక్‌ హెలికాప్టర్లు.. ఇలా వాయుసేన అమ్ములపొదిలోని ఒక్కో అస్ర్తాన్ని వాస్తవాధీన రేఖ దగ్గర భారత్‌ మోహరిస్తోంది. చైనాతో గాల్వన్ లోయ దగ్గర తీవ్ర ఘర్షణ.. జవాన్ల వీర మరణం నేపథ్యంలో ఇప్పటికే సైన్యం అప్రమత్తం కాగా, వాయు సేన దానికి తోడవుతోంది. అటు పొరుగు దేశం సైతం దీనికి తగ్గట్లే బలగాలు, యుద్ధ విమానాలను మోహరిస్తోంది. దీంతో ప్రస్తుతం బోర్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొంది.

Read: ఫాదర్స్ డే-2020: గూగుల్ డూడుల్.. మీ నాన్నకు ఇలా గ్రీటింగ్ కార్డ్ పంపండి