సంతోష్ బాబు కుటుంబానికి కేసీఆర్ పరామర్శ.. భారీ సాయాన్ని అందించిన సీఎం

సూార్యాపేటలోని అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు నివాసానికి రోడ్డుమార్గాన సీఎం కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి కేసీఆర్ నివాళులర్పించారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని ఆయనే స్వయంగా సంతోష్ బాబు కుటుంబానికి అందజేశారు. సంతోష్ బాబు తల్లిదండ్రులకు రూ. కోటి చెక్కును కేసీఆర్ అందజేశారు.
సంతోష్ బాబు సతీమణికి రూ. 4 కోట్లు చెక్కును ఆయన అందజేశారు. ఇంటి స్థలం పత్రాలను కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ అందజేశారు. సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూపు-1 నియామక పత్రాన్ని సీఎం అందించారు బంజారాహిల్స్ లో 711 గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఇంటి స్థలం పత్రాలను కూడా కల్నల్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ అందజేశారు. ఆ తర్వాత సంతోష్ బాబు సతీమణి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయం అందించారని చెప్పారు.
గ్రూపు-1 ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం అందించారు. బంజారాహిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలు ఇచ్చారని ఆమె తెలిపారు. మిగతా సైనికులకు కూడా రూ. 10 లక్షల చొప్పున సాయం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఎప్పుడూ ఏ అవసరమొచ్చినా తమకు అండగా ఉంటామని కేసీఆర్ చెప్పారని, తెలంగాణ ప్రభుత్వానికి రుణ పడి ఉంటామని కల్నల్ సంతోష్ బాబు సతీమణి చెప్పారు.
మరోవైపు సంతోష్ బాబు తల్లి కూడా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాక తమలో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించే గొప్పతనం కేసీఆర్‌ది అని వీరమాత చెప్పారు. సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. కోర్టు ప్రాంతంలో ఉన్న చౌరస్తాలో సంతోష్ బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఆ చౌరస్తాను సంతోష్ బాబు చౌరస్తాగా మారుస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.