Algorithm Detect Cancer Cells : క్యాన్సర్ కణాల మార్పులను గుర్తించే సరికొత్త అల్గారిథం..
గణిత అధారితమైన అల్గోరిథం ద్వారా క్యాన్సర్ కణాల వృద్ధికి కారణభూతమయ్యే డ్రైవర్ మార్పులకు, వ్యాధి పై ప్రభావం చూపని పాసింజర్ మార్పులకు మధ్య తేడాను సులభంగా గుర్తించేందుకు వీలవుతుంది.

గణిత అధారిత అల్గోరిథం ను అభివృద్ధి చేసిన మద్రాస్ ఐఐటి
Algorithm Detect Cancer Cells : మానవ సమాజానికి కాన్సర్ మహమ్మారి ఓ రాచపుండుగా తయారైంది. ప్రతినిత్యం అనేక మంది దీని బారినపడి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. దీనిని ఎదుర్కోవటం వైద్య పరిశోధకులుకే పెద్ద సవాల్ గా మారింది. ఇప్పటికే దీనిపై పూర్తిస్ధాయిలో పరిశోధనలు కొనసాగుతుండగా, మద్రాస్ ఐఐటీ పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు.
కాన్సర్ కు దారితీసేలా శరీర కణాల్లో జరుగుతున్న మార్పులను గుర్తించే సరికొత్త అల్గారిథం కృత్రిమ మేధను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. ఈ అల్గారిథం పూర్తిగా గణిత అధారితమైనదని దీని ద్వారా డీఎన్ఎను విశ్లేషించటం సులభమౌతుందని నిర్ధారించారు. తద్వారా జన్యుపరమైన మార్పులను సులభంగా గుర్తించేందుకు సాధ్యమౌతుందని ప్రకటించారు.
జన్యుపరమైన మార్పులను గుర్తించటమే ఇంతకాలం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా నిలిచింది. గణిత అధారితమైన అల్గారిథం ద్వారా క్యాన్సర్ కణాల వృద్ధికి కారణభూతమయ్యే డ్రైవర్ మార్పులకు, వ్యాధి పై ప్రభావం చూపని పాసింజర్ మార్పులకు మధ్య తేడాను సులభంగా గుర్తించేందుకు వీలవుతుంది. తద్వారా ఏవైతే కణాలు వ్యాధి తీవ్రతకు కారణమౌతున్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
క్యాన్సర్ పరిశోధకులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళల్లో డ్రైవర్ మార్పులకు , ప్యాసింజర్ మార్పులకు మధ్య తేడాను గుర్తించటమేనని ఇకపై గణిత అల్గారిథం ద్వారా సమస్యకు పరిష్కారం లభించనట్లేనని మద్రాస్ ఐఐటి ఎం రాబర్ట్ బాష్ సెంటర్ ఫర్ డేటా సైన్స్ పరిశోధకులు ప్రొఫెసర్ బి.రవీంద్రన్ తెలిపారు. దీని ద్వారా కాన్సర్ తో బాధపడుతున్న రోగికి సమయానుకూలంగా ఔషధాలను అందించటం వీలవుతుందన్నారు.