Gslv-F10 : నింగిలోకి జీఎస్ ఎల్వీ-ఎఫ్ 10… ఈనెల 12న ముహుర్తం
ప్రస్తుతం జిఎస్ ఎల్ వి-10ప్రయోగాన్ని వాతావరణ పరిస్ధితులకు లోబడి ఆగస్టు 12 న నిర్వాహించాలని నిర్ణయించినట్లు ఇస్రో ప్రకటించింది.

Gsat1 (2)
Gslv-F10 : భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) జిఎస్ ఎల్ వి-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు ప్రారంభించింది. ఈనెల 12వ తేదిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి దీనిని ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. గత ఏడాది మార్చిలోనే జీఎస్ ఎల్వీ- ఎఫ్ 10 రాకెట్ ద్వారా అత్యాధునికమైన జియో ఇమేజింగ్ శాటిలైట్ జిసాట్-1 ను కక్స్యలోని ప్రవేశపెట్టాలని చేసిన ప్రయత్నాలు సాంకేతిక కారణాల కారణంగా చివరి నిమిషంలో నిలిచిపోయాయి.
కోవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చిన తరువాత ఇస్రో కార్యాకలాపాలు కాస్త నెమ్మదించినప్పటికీ గడచిన ఫిబ్రవరిలో బ్రెజిల్ కు చెందిన భూ పరిశీలన ఉపగ్రహం అమేజానియా-1ఉపగ్రహంతో పాటు 18నానో ఉపగ్రహాలను విజయవంతంగా రోదసిలోకి చేరవేసింది. కరోనా రెండవ దశ నేపధ్యంలో ప్రయోగాల కొనసాగింపుకు కొంత అంతరాయం ఏర్పడింది.
ప్రస్తుతం జిఎస్ ఎల్ వి-10ప్రయోగాన్ని వాతావరణ పరిస్ధితులకు లోబడి ఆగస్టు 12 న నిర్వాహించాలని నిర్ణయించినట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రో రూపకల్పన ప్రకారం కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న జిశాట్ 1 భారత ఉపఖండానికి సంబంధించిన సమయపరిశీలన, వాతావరణ పరిస్ధితులను నీర్ణీత వ్యవధిలో ఖచ్చితంగా అంచనా వేసేందుకు దోహదపడుతుంది. భూమి పరిశీలన ఉపగ్రహం దేశ సరిహద్దుల వాస్తవ చిత్రాలను అతి దగ్గరగా అందించే టెక్నాలజీని కలిగి ఉంది.
ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయితే ఇది ఒకరకంగా భారత దేశానికి గేమ్ ఛేంజర్ అవుతుందని అంతరిక్ష పరిశోధనా అధికారులు భావిస్తున్నారు. ఆన్ బోర్డ్ హై రిజల్యూషన్ కెమెరాలతో , భారత భూభాగం, సముద్రాలు, సరిహద్దులు నిరంతరం పర్యవేక్షించటానికి ఈ ఉపగ్రహం తోడ్పడనుంది.
ప్రకృతి వైపరిత్యాలు, స్వల్పకాలిక సంఘటనలను త్వరిత గతిన పర్యవేక్షించడంతోపాటు, వ్యవసాయం, అటవీ ,ఖనిజశాస్త్రం, విపత్తు హెచ్చరిక, మేఘ లక్షణాలు, మంచు , హిమనీనదాలు, సముద్ర శాస్త్రం, తదితర అనుబంధరంగాలకు దీనివల్ల ప్రయోజనం చేకూరనుందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. వాతావరణం అంతా అనుకూలంగా ఉంటే ఆగస్టు 12న ప్రయోగం కొనసాగించేందుకు ఇస్రో సమాయత్తమౌతుంది.