నాల్గవ స్థానంలోకి టీమిండియా.. ఫైనల్‌కు ఛాన్స్ ఉంది..

నాల్గవ స్థానంలోకి టీమిండియా.. ఫైనల్‌కు ఛాన్స్ ఉంది..

Updated On : February 9, 2021 / 4:34 PM IST

కంగారూలను వారి దేశంలోనే మట్టి కరిపించి భారత్‌ గడ్డపై ఉత్సాహంగా ఇంగ్లండ్‌ను పడగొట్టాలని నిర్ణయించుకుని బరిలోకి దిగిన టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. చెన్నైలో తొలి టెస్టులో హాట్ ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగిన భార‌త్.. ఇంగ్లండ్‌ల చేతిలో ఓటమి పాలయ్యింది. తొలి ఇన్నింగ్స్‌ 578పరుగులు చేసిన ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్‌ 178 ఆలౌట్‌ కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 337పరుగులకు ఆలౌట్‌ అయ్యి, రెండవ ఇన్నింగ్స్‌లో 192పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 227 పరుగుల తేడాతో కోహ్లి సేన పరాజయం పాలైంది.

మ్యాచ్ గెల‌వాలంటే చివ‌రి రోజు 381 ప‌రుగులు చేయాలి.. ఓట‌మి త‌ప్పించుకోవాలంటే చేతిలో ఉన్న 9 వికెట్ల‌తో చివ‌రి బంతి వ‌ర‌కూ పోరాడాలి. అటువంటి సమయంలో జాగ్రత్తగా ఆడలేక ఓటమి పాలైంది టీమిండియా. ఒక వికెట్ న‌ష్టానికి 39 ప‌రుగుల‌తో.. ఐదో రోజు పోరాటం ప్రారంభించిన భార‌త్‌కు.. ఆండ‌ర్స‌న్, జాక్ లీచ్‌ కోలుకోలేని దెబ్బ‌కొట్టారు. తొలుత పుజారా (15)ని అవుట్ అవగా.. అక్క‌డి నుంచి వికెట్ల ప‌త‌నం ప్రారంభ‌మైంది. గిల్ (50) ఆండ‌ర్స‌న్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవ‌ర్లో రెహానే (0) పెవీలియన్ చేరుకున్నాడు.

తర్వాత అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న పంత్ (11) క్రీజులోకి రాగా.. ముందుగానే అవుట్ అయ్యాడు.. కోహ్లి (72), అశ్విన్ (9) వికెట్ల ప‌త‌నాన్ని కాసేపు అడ్డుకున్నారు. చివ‌రికి 192 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో విజయంతో ఇంగ్లాండ్ జట్టు.. 442 పాయింట్లతో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు మరింత దగ్గరైంది.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ వాయిదా పడడంతో వరల్డ్‌ టెస‍్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా న్యూజిలాండ్‌ నిలవగా.. టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికి టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. రాబోయే మూడు టెస్టుల్లో కనీసం రెండు టెస్టులు గెలిస్తే.. భారత్‌ టెస్టు చాంపియన్‌షిప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఇంగ్లండ్‌ మిగతా మూడు టెస్టుల్లో రెండు గెలిస్తే మాత్రం టీమిండియాకు అవకాశాలు ఉండవు. లార్డ్స్‌ వేదికగా జూన్‌లో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగబోతుంది.