ఖైరతాబాద్ గణేశ్‌పై కరోనా ఎఫెక్ట్.. మరోసారి విగ్రహం ఎత్తులో మార్పు

ఖైరతాబాద్ గణేష్‌డు అంటేనే భారీ రూపం. కానీ కరోనా మహమ్మారి చివరికి ఖైరతాబాద్ గణేష్‌డిపైనా పడింది. దీంతో ఈ ఏడాది 27 అడుగులకే ఏకదంతుడు పరిమితం కానున్నాడు. 27 అడుగుల మట్టి విగ్రహాన్ని తయారు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈసారి భక్తులకు ఆన్‌లైన్ దర్శన ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టు ఉత్సవ కమిటీ ప్రకటించింది.
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజూ పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వైరస్‌కు భయపడి పల్లెలకు తరలిపోతున్నారు. బతికుంటే బలుసాకు తినొచ్చంటూ హైదరాబాద్‌ను ఖాళీ చేసేస్తున్నారు. మరోవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. జనాలు గుడిగూడకుండా చూస్తోంది.
జీహెచ్‌ఎంసీలో కరోనా ప్రతాపం చూపుతుండడంతో… ఖైరతాబాద్ గణేష్‌డు కూడా తన రూపాన్ని తగ్గించుకున్నాడు. ఈ ఏడాది 27 అడుగులకే పరిమితం కానున్నాడు. గత ఏడాదితో పోల్చితే 38 అడుగులు విగ్రహ ఆకారం తగ్గింది.
వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఒక్క అడుగు విగ్రహమే పెట్టాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. దీంతో విగ్రహ పనులేమీ మొదలుపెట్టలేదు. అయితే భక్తుల నుంచి ఉత్సవ కమిటీ సభ్యులపై ఒత్తిడి పెరిగింది. భారీ స్థాయిలో కాకపోయినా… కొంచెం తగ్గించైనా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న వినతులు వస్తున్నాయి. మరీ ఒక్క అడుగు వద్దని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఈ ఏడాది 27 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
గతేడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా ఖైరతాబాద్ గణేష్‌డు పూజలు అందుకున్నాడు. ఈ ఏడాది మాత్రం కరోనా నేపథ్యంలో 27 అడుగులకే పరిమితంకానున్నాడు. 27 అడుగులే కనుక పూర్తి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ 27 అడుగులతో ధన్వంతరి వినాయకుడిని ఏర్పాటు చేయనుంది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆన్‌లైన్ ద్వారా కూడా దర్శనానికి ఏర్పాట్లు చేయనున్నారు. జులై పది నుంచి మట్టి విగ్రహ నిర్మాణం మొదలు కానుంది.
Read:ప్రగతి భవన్ లో కరోనా కలకలం