సులభ్ కాంప్లెక్స్ లో మటన్ దుకాణం : ఓ వైపు ఆ వాడకం..మరోవైపు అమ్మకం

Madhya Prades : Selling mutton in Sulabh Complex : చికెన్, మటన్, కోడిగుడ్లు కావాలంటే కావాలంటే మీట్ షాపులకు వెళ్లి కొనుక్కుంటాం. కానీ మటన్ కావాలంటే ఎవరైనా సులభ్ కాంప్లెక్స్ కు వెళతారా? మలమూత్ర విసర్జన చేసే కాంప్లెక్స్ లో మటన్, చికెన్ కావాలంటే ఓ ప్రాంతంలోని ప్రజలు సులభ్ కాంప్లెక్స్ కు వెళుతున్నారు. కారణం ఏంటో తెలిస్తే..‘ఛీ..యాక్ అనటమే కాదు..షాక్ అవ్వటం ఖాయం..సులభ్ కాంప్లెక్స్ లో మటన్, చికెన్, గుడ్లు అమ్ముతున్నాడో వ్యక్తి. ఓ పక్కన మాంసం అమ్మకాలు..మరోపక్క..మలమూత్ర విసర్జనలు జరుగుతున్న ఈ వింత విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర పరిథిలోని సులభ్ కాంప్లెక్స్ లో జరుగింది.
సులభ్ కాంప్లెక్స్ ను నిర్వహించమని ఓ వ్యక్తికి అప్పజెప్పితే..అతను కాస్తా కబ్జారాయుడిగా మారాడు. ఆ సులభ్ కాంప్లెక్స్ ని కాస్తా మాంసం దుకాణంగా మార్చేశాడు. ఓ వైపు మలమూత్రా విసర్జన్ పనులు జరుగుతుంటే మరో వైపు చికెన్, మటన్, కోడిగుడ్లు అమ్మేస్తున్నాడు. దీంతో అతను రెండు రకాలుగా ఆదాయాన్ని పొందుతున్నాడు. ఓ వైపు సులభ్ కాంప్లెక్స్ నిర్వహణకు వచ్చే జీతంతోపాటు, వచ్చే పైసలు..మరోవైపు మాంస వ్యాపారంతో డబ్బులు దండిగానే సంపాదిస్తున్నాడు. అలా చేస్తూండగా ఆ విషయం కాస్తా మున్సిపాల్టీ అధికారుల చెకింగ్ రావటంతో అడ్డంగా దొరికిపోయాడు.
దీంతో అధికారులు అతనిపై మండిపడ్డారు. వెయ్యి రూపాయల జరిమానా విధించారు. అదే సమయంలో సులభ్ కాంప్లెక్స్ లను నిర్వహించే ఎన్జీవో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు కూడా 20వేల రూపాయల జరిమానాను విధించారు. మొత్తానికి ఓ వ్యక్తి నిర్వాకం వల్ల అటు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడటంతోపాటు, ఇటు సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు కూడా అప్రతిష్టకు గురయ్యారు.
సులభ్ కాంప్లెక్స్ లో మటన్, గుడ్ల వ్యాపారం జోరుగా నడుస్తోందన్న వార్తలపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడిచింది. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సులభ్ కాంప్లెక్స్ లో మాంసం అమ్మితే మాత్రం కొనేవాళ్లు ఎలా కొంటున్నారు? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సదరు వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.