Making Beds with Used Masks: వాడేసిన మాస్కులతో బెడ్ల తయారీ.. ఇలా తయారయ్యారేంట్రా!

ప్రజల ఆరోగ్యంతో జూదం ఆడేసుకొని డబ్బు సంపాదించడం అనే కొత్త దందా ఒకటి పుట్టుకొచ్చింది. కరోనా మహమ్మారి అంటే ప్రజల వెన్నులో వణుకుపుడుతుంది. పోయినట్లే పోయి మళ్ళీ విజృంభించిన మహమ్మారి దెబ్బకు ప్రపంచం మరోసారి హడలెత్తిపోతుంది. ఏడాది కాలంగా ముఖాలకు మాస్కులతో గడిపేస్తున్న సమాజంలో వాడేసిన మాస్కులు పెద్ద దిబ్బలుగా పేరుకుపోతున్నాయి. సరిగ్గా కేటుగాళ్ల కళ్ళు ఇప్పుడు ఈ వాడేసిన మాస్కుల మీద పడ్డాయి.

Making Beds with Used Masks: వాడేసిన మాస్కులతో బెడ్ల తయారీ.. ఇలా తయారయ్యారేంట్రా!

Making Beds With Used Masks

Updated On : April 13, 2021 / 2:35 PM IST

Making beds with Used Masks: కాదేదీ కల్తీకి అనర్హం అనే మాట ఈ మధ్య మనం తరచుగా వింటూనే ఉంటున్నాం. తాగేది.. తినేది.. వండేది.. ఏదైనా కల్తీ చేసి కాసులు వెనకేసుకొనే బ్యాచ్ కోకొల్లలు పుట్టుకొస్తూనే ఉంటున్నాయి. కాసులకు కక్కుర్తిపడి చేసే ఈ దందాలలో మనుషుల ఆరోగ్యం పణంగా పెట్టి వాళ్ళు బ్రతికేస్తుంటారు. కాగా.. అదే ప్రజల ఆరోగ్యంతో జూదం ఆడేసుకొని డబ్బు సంపాదించడం అనే కొత్త దందా ఒకటి పుట్టుకొచ్చింది. కరోనా మహమ్మారి అంటే ప్రజల వెన్నులో వణుకుపుడుతుంది. పోయినట్లే పోయి మళ్ళీ విజృంభించిన మహమ్మారి దెబ్బకు ప్రపంచం మరోసారి హడలెత్తిపోతుంది. ఏడాది కాలంగా ముఖాలకు మాస్కులతో గడిపేస్తున్న సమాజంలో వాడేసిన మాస్కులు పెద్ద దిబ్బలుగా పేరుకుపోతున్నాయి.

సరిగ్గా కేటుగాళ్ల కళ్ళు ఇప్పుడు ఈ వాడేసిన మాస్కుల మీద పడ్డాయి. ఇండియాలో మహారాష్ట్రలోని కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ మాస్కుల వాడకం కూడా అధికంగానే ఉంది. ఈక్రమంలోనే అక్కడే వాడేసిన మాస్కులతో పరుపుల తయారీ చేసి కొందరు కొత్త దందాకు తెరలేపారు. ఆ రాష్ట్రంలోని జలగావ్ జిల్లాలో ఒక ఫోన్ కాల్ తో సోదాలు నిర్వహించిన పోలీసులకు అక్కడ సీన్ చూసి షాక్ తిన్నారు. ప్రజలు వాడి పారేసిన మాస్కులతో బెడ్లను రూపొందించి అమ్ముకుంటున్నారు. సాధారణంగా పరుపుల తయారీలో కాటన్, స్పాంజి, గుడ్డ ముక్కలు వంటివి వాడతారు. కానీ ఇక్కడ వాటి బదులు వాడేసిన మాస్కులను ఉపయోగిస్తున్నారు.

ఆగంతకుడి ఫోన్ కాల్ తో రంగంలోకి దిగిన పోలీసులు గోదాములలో సోదాలు నిర్వహించి వాడి పారేసిన మాస్కుల గుట్టలను సీజ్ చేసి తగలబెట్టారు. టన్నుల కొద్దీ వేస్ట్ మాస్కులను సేకరించిన ఈ ముఠా కొద్ది రోజులుగా పరుపుల తయారీ మొదలుపెట్టింది. ఆ వేస్ట్ మాస్కులలో కరోనా పేషేంట్లు వాడిన మాస్కులు, కరోనా ఆసుపత్రుల నుండి సేకరించిన మాస్కులు కూడా ఉన్నాయని తెలుస్తుండగా ఈ ఉదంతం బయటకు రావడంతో జలగావ్ లో ఇది ప్రకంపనలు సృష్టిస్తుంది. సమాజంలో ఇంతటి నీచులు కూడా ఉన్నారా అని ప్రజలు విస్తుపోతుండగా ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.