లాక్ డౌన్ 3.0 : 1200 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం..చివరకు మృత్యులోకాల్లోకి

లాక్ డౌన్ వేళ..వలస కూలీల పరిస్థితి దుర్బరంగా మారుతోంది. తమ తమ స్వగ్రామాలకు వెళుదామని..అనుకుంటూ..వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. బస్సుల్లో..రైళ్లలో కాదు. ఒకరు నడుచుకుంటూ వెళుతుంటే..మరొకరు సైకిళ్లపై వెళుతున్నారు. అన్ని కిలోమీటర్లు ప్రయాణించడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురై..కొంతమంది ఇంటికి చేరుకోకుండానే మృత్యులోకాలకు వెళ్లిపోతుండడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. తాజాగా..ఢిల్లీ నుంచి బీహార్ రాష్ట్రానికి వెళ్లిన యువకుడు మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఈ ఘటన అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
బీహార్ లోని ఖగారియా జిల్లాకు చెందిన ధర్మవీర్ కుమార్ (28)..ఢిల్లీలోని షాకూర్ బస్తీలో కూలీ పనిచేసుకుంటూ..జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. అసలు లాక్ డౌన్ ఎన్నిరోజులు ఉంటుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. దీంతో..సొంత గ్రామానికి వెళ్లాలని అనుకున్నాడు. ఇతనికి మరో ఆరుగురు ఫ్రెండ్స్ జత కలిశారు. అందరూ కలిసి…ఢిల్లీ నుంచి ఖగారియా (బీహార్) కు పయనం అయ్యారు. మొత్తం 1200 కిలోమీటర్లు ఉంటుంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహార్ పూర్ (350 కి.మీ) ప్రయాణించారు. పగలు మొత్త ప్రయాణించి…ఢిల్లీ – బరేలీ మార్గంలోని ఓ టోల్ ప్లాజా సమీపంలో విశ్రాంతి తీసుకున్నారు. అందరూ నిద్రపోయారు. ఉదయాన్నే అందరూ లేచారు. కానీ ధర్మవీర్ మాత్రం లేవలేదు. ఎంత లేపినా..ధర్మవీర్ లో చలనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ధర్మవీర్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.
కరోనా పరీక్షలు నిర్వహించగా..ఇతనికి నెగటివ్ అని తేలిందని వైద్యులు తెలిపారు. ఎక్కువ దూరం ప్రయాణించడంతో నీరసించిపోయాడని, ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ సోకిందని దీని కారణంగానే మృతి చెందాడరని వెల్లడించారు.
మరోవైపు దేశ వ్యాప్తంగా ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే వారి వారి సొంతూళ్లకు వెళ్లి..చిక్కుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తాజాగా కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం 2020, మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగనున్న సంగతి తెలిసిందే.
See Also | కరోనా కట్టడికి సరికొత్త బైక్ సృష్టించాడు.. భౌతిక దూరానికి ఆయుధమన్నాడు!