Mithali Raj: వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ కు వీడ్కోలు!

Mithali Raj
Mithali Raj: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా జరిగే ప్రపంచ కప్ క్రికెట్ పోటీల తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్లో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాను.. 2022 కెరీర్ చివరి ఏడాది కావచ్చని తెలిపారు. శనివారం వర్చువల్ గా జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మిథాలీ.
ఈ సందర్బంగా ఆమె అనేక విషయాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ అంశం ప్రస్తావించారు. వయసు పైబడుతున్న కొద్దీ ఫిట్నెస్ పై ఎక్కువ దృష్టిపెట్టి ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని తెలిపారామే. వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్రతి సిరీస్ మాకు ముఖ్యమే. వరల్డ్ కప్ కోసం పటిష్ట జట్టును రూపొందించే పనిలో ఉన్నామని మిథాలీ తెలిపారు.
ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మనం కొంచెం బలహీనంగా ఉన్నాం. సీనియర్ జులన్ గోస్వామి రిటైరైతే ఆమె స్థానాన్ని భర్తీ చేసేవారు కావాలి’ అని 38 ఏళ్ల మిథాలీ తెలిపింది. మిథాలీ రాజ్ 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేశారు. ఆమె ఇప్పటివరకు 10 టెస్టులు, 214 వన్డేలు, 89 టి20 మ్యాచ్‌లు ఆడారు. కాగా ‘1971: ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ గ్రేట్‌నెస్’ పుస్తకావిష్కరణ వర్చువల్ కార్యక్రమానికి సునీల్ గవాస్కర్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా గవాస్కర్ పలు సూచనలు చేశారు. ప్రత్యర్థి జట్టుపై ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించాలని… ఈ విషయంలో విరాట్ కోహ్లిని మిథాలీ రాజ్ బృందం ఆదర్శంగా తీసుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించారు.