గ్రామంలో పనిచేయించటానికి..50 అడుగుల ఎత్తులోఉయ్యాల్లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న మంత్రి

గ్రామంలో పనిచేయించటానికి..50 అడుగుల ఎత్తులోఉయ్యాల్లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న మంత్రి

Updated On : February 22, 2021 / 11:02 AM IST

minister works from 50 ft high swing : అతనో రాష్ట్ర మంత్రి..ఓ గ్రామంలో పనులు చేయించటానికి ఆయనే స్వయంగా వచ్చారు. పనిలో భాగంగా ఆయన కొంతమంది అధికారులతో మాట్లాడటానికి నానా తిప్పలు పడుతున్నారు. ఎందుకంటే ఆ గ్రామంలో ఫోన్ సిగ్నల్స్ సరిగా ఉండవు. దీంతో సదరు మంత్రి నేలకు 50 అడుగుల ఎత్తులో ఓ ఉయ్యాల కట్టించుకుని ఆ ఉయ్యాలలో కూర్చుని మాట్లాడుతూ పనులు చేయిస్తున్నారు. మంత్రి ఉయ్యాల కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మధ్యప్రదేశ్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ మొబైల్‌కు నెట్‌వర్క్ సరిగా రాలేదు. అశోక్ నగర్ జిల్లాలోని ఆంఖో గ్రామంలో దగ్గరుండి మరీ పనులు చేయిస్తున్నారు. పనులు చేయించే క్రమంలో ఫోన్ మాట్లాడుతుండగా సిగ్నల్స్ లేకపోవటంతో ఫోన్ పదే పదే కట్ అవుతోంది. దీంతో మంత్రి బిజేంద్ర సింగ్ యాదవ్ గ్రామంలోని ఓ ప్రాంతంలో 50 అడుగుల ఎత్తులో ఉయ్యాల ఏర్పాటు చేసుకున్నారు.

ఆ ఉయ్యాల ఎక్కి పని చేయిస్తున్నారు. గత తొమ్మిది రోజులుగా మంత్రి ఇలాగే చేస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు 3 గంటలపాటు ఉయ్యాల్లో కూర్చొని పని చేయించి తిరిగి వెళ్తున్నారట. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

దీని గురించి మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారులతో ఫోన్ లో మాట్లాడాల్సి ఉంది. ఫోన్ మాట్లాడటానికి సిగ్నల్స్ అందటం లేదు. దీంతో వేరే దారి లేక అధికారులను సంప్రదించడానికి ఉయ్యాల ఎక్కి ఫోన్ మాట్లాడుతున్నానని మంత్రి తెలిపారు. గత తొమ్మిది రోజుల నుంచి నేను గ్రామంలో ఉండి పనులు చేయిస్తున్న క్రమంలో ప్రతీ రోజు మూడు గంటలపాటు ఉయ్యాలలో కూర్చునే మాట్లాడాల్సి వస్తోందని తెలిపారు.