కరోనా బారినపడ్డ రామ్ తల్లి, సోదరుడు..

Ram Pothineni: కరోనా మహమ్మారి 2020లో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేసింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ బారినపడి కోలుకోగా మరికొందరు కన్నుమూశారు. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. తన తల్లి, సోదరుడికి కరోనా సోకినట్లు తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ 2020 గురించి మాట్లాడాడు.
‘కరోనా కారణంగా ఈ ఏడాది క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అందులో కొన్ని మంచివి.. మరికొన్ని చెడ్డవి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండడం వల్ల ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. అది సంతోషంగా అనిపించింది. అయితే ఎక్కువ రోజులు ఇంట్లోనే గడపాల్సి రావడం కూడా చికాకు కలిగించింది. ఇక నా తల్లి, సోదరుడు (కృష్ణ చైతన్య) కరోనా బారిన పడడం భయపెట్టింది. నా సోదరుడికి కాస్త సీరియస్ అయ్యింది. అయితే వైద్యుల చికిత్స వల్ల అతను కోలుకున్నాడు’ అని రామ్ తెలిపాడు.
‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల తర్వాత దర్శకుడు కిషోర్ తిరుమలతో రామ్ నటించిన ‘రెడ్’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ మూవీలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. నివేదా పేతురాజ్, అమృత అయ్యర్, మాళవిక శర్మ కథానాయికలుగా నటించారు. మణిశర్మ సంగీతమందించారు.