Kamareddy District: ఆధార్ కార్డు ఇచ్చే ఊళ్ళో అడుగుపెట్టాలి.. లేదంటే నో ఎంట్రీ!

Kamareddy District
Kamareddy District: మన దేశంలో ఊరికో ఆచారం.. పల్లెకో కట్టుబాటు ఉంటుంది. ఇవి అనాగరికంగా ఉంటే ఆయా గ్రామాలలో ప్రజలకు ఇబ్బంది కాగా.. నాగరికంగా ఉంటే మాత్రం ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి. మన దేశంలో సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలంటే అందరికీ హక్కు ఉంటుంది. ప్రత్యేక కారణాలు ఏమైనా ఉంటే తప్ప ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఇక పరాయి దేశానికి వెళ్లాలంటే మాత్రం పాస్ పోర్ట్ కావాల్సి ఉంటుంది. అయితే.. ఏకంగా ఒక గ్రామంలో బయటి వారు ఎంటర్ అవ్వాలంటే మాత్రం ముందుగా ఆధార్ కార్డు చూపించి వెళ్లాల్సి ఉంది. అది కూడా ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలలో ఒక్కటైన తెలంగాణలోనే. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పొతంగల్ గ్రామంలో గత పదేళ్లుగా ఈ ఆధార్ ఎంట్రీ కట్టుబాటులో అమల్లో ఉంది.
అసలు ఈ ఆధార్ ఎంట్రీ కట్టుబాటు ఏంటి అంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే. ఈ పొతంగల్ గ్రామంలో మొత్తం 2,500 జనాభా ఉండగా ప్రజలలో ఎక్కువ భాగం వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అయితే, పదేళ్ల క్రితం ఒళ్లంతా వీభూతితో కాషాయం బట్టలు వేసుకుని ఓ వ్యక్తి ఈ గ్రామంలోకి వచ్చాడు. వ్యవసాయ ఆధార గ్రామం కావడంతో మధ్యాహ్నం సమయంలో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి, పొలం పనులకు వెళ్లారు. అదే అదనుగా గ్రామంలోకి వచ్చిన వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న వారిని గమనించి మాటలతో ఓ వ్యక్తిని బుట్టలో వేసుకున్నాడు. బంగారాన్ని పూజ చేసి రెట్టింపు చేస్తానని నమ్మించి అందిన కాడికి దోచుకెళ్ళాడు. మోసపోయిన వ్యక్తి స్పృహలోకి వచ్చేసరికి ఆ దొంగబాబా ఇల్లంతా గుల్ల చేశాడు. ఆ మోసగాడి కోసం ఊరు ఊరంతా గాలించినా ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. దీంతో గ్రామంలోని ప్రజలంతా కలిసి చర్చించి నిర్ణయించుకొని ఇకపై తమ గ్రామంలోకి ఎవరైనా వ్యక్తులు రావాలంటే.. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి రావాల్సిందేనని నిబంధన విధించారు. తదనంతరం ఏదో ఒక గుర్తింపు కార్డు కంటే ఆధార్ కార్డు బెటర్ అనే చివరికి ఆధార్ ఎంట్రీగా మారిపోయింది.
పొతంగల్ గ్రామం పక్కనే ఉండే గ్రామంలోని ప్రజలైనా.. పొతంగల్ గ్రామంలోని ప్రజలకు దగ్గరి బంధువులైనా సరే ఆధార్ ఉంటేనే ఎంట్రీ ఇస్తారు. ఈ ఊళ్ళో అడుగుపెట్టగానే ముందుగా పంచాయతీ కార్యాలయం కనిపిస్తే అక్కడే పంచాయతీ అధికారులతో పాటు గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా ఎవరొకరు కూర్చొని ఉంటారు. గ్రామంలోకి వెళ్ళాలి అనుకున్న వారు వారి దగ్గరకి వెళ్లి ఆధార్ కార్డు ఇచ్చి ఎందుకు గ్రామంలోకి వెళ్లాలని అనుకుంటున్నారో చెప్పి వెళ్లాల్సి ఉంది. రోజూ కూరగాయలు అమ్ముకొనే వ్యక్తి నుండి.. వారానికి ఒకసారి వచ్చే అతిధులు కూడా ఆధార్ కార్డు ఇచ్చే వెళ్ళాలి. వారు గ్రామం నుండి తిరిగి వెళ్లేప్పుడు మాత్రం వారి ఆధార్ కార్డు మళ్ళీ తిరిగి వారికి ఇచ్చేస్తారు. గత పదేళ్లుగా ఈ ఆధార్ ఎంట్రీ నిబంధన ఉండగా ఈ పదేళ్లలో ఇక్కడ ఒక్క దొంగతనం కానీ.. దొంగబాబాల మోసాలు కానీ లేనేలేవట. ఈ గ్రామంలో కట్టుబాటు ఇప్పుడు ఆ జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది.