లాక్‌డౌన్ దెబ్బకు కుదేలైన రిటైల్‌.. రూ.5.5 లక్షల కోట్ల నష్టం 

  • Published By: srihari ,Published On : May 6, 2020 / 01:22 AM IST
లాక్‌డౌన్ దెబ్బకు కుదేలైన రిటైల్‌.. రూ.5.5 లక్షల కోట్ల నష్టం 

Updated On : May 6, 2020 / 1:22 AM IST

కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. భారతదేశవ్యాప్తంగా లాక్ డౌన్ దెబ్బకు రిటైల్ రంగం కుదేలైంది. 7 కోట్ల మంది వ్యాపారులన్న రిటైల్‌ రంగం రూ.5.5 లక్షల కోట్లు నష్ట పోయిందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (CAIT) వెల్లడించింది. 20 శాతం మంది రిటైలర్లు రానున్న కాలంలో తమ వ్యాపారాలను మూసివేయనున్నట్టు ప్రకటించారు. కష్ట కాలంలో వర్తకులను ఆదుకోవడానికి ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని విన్నవించినట్టు CAIT సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ వివరించారు.

భారత వర్తకుల రోజువారీ వ్యాపారం విలువ రూ.15,000 కోట్లు వరకు ఉంటుందని చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమకు రూ.5.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని, 1.5 కోట్ల మంది వర్తకులు వ్యాపారాలను శాశ్వతంగా మూసివేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. వర్తకుల ఆధారపడ్డ 75 లక్షల మంది చిరు వ్యాపారులు కూడా నష్టపోయారు. దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది సూక్ష్మ, చిన్నవ్యాపారులు ఉంటారని ఆయన అన్నారు.

ఈ విపత్కర పరిస్థితిని తట్టుకునే బలం వ్యాపారులకు లేదని, వర్తకులు తమ ఉద్యోగుల జీతాలు, షాపుల అద్దెలు చెల్లిస్తున్నారని తెలిపారు. కస్టమర్ల ఖర్చు చేయతగ్గ ఆదాయం తగ్గిందని కూడా తెలిపారు. వ్యాపారాలు సాధారణ స్థితికి రావడానికి 6–9 నెలల సమయం పడుతుందన్నారు. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, అన్ని రంగాల్లో డిమాండ్‌ తక్కువగా ఉందని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న ఆశలు కోల్పోయామని ఖండేల్వాల్‌ వివరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఈ రంగానికి ఊహించని నష్టం వాటిల్లుతుందని CAIT జాతీయ అధ్యక్షుడు బి.సి.భాటియా అన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే కరోనాను మించిన ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.

Also Read | మద్యం బాటలోనే.. : పెరుగుతున్న పెట్రోల్ ధరలు