వీరమాత అంతరంగం : కన్నీరు తెప్పిస్తున్న సంతోష్ బాబు చివరి మాటలు..!

అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు వీరమరణంతో కన్నతల్లిగా ఒకవైపు బాధపడుతున్నానని, మరోవైపు తన కొడుకుకు దక్కిన గౌరవానికి బాధను కూడా మర్చిపోతున్నానని అన్నారు తల్లి మంజుల. సంతోష్ బాబు అమరుడయ్యాడంటే తాను నమ్మలేకపోయానని కంటితడి పెట్టుకున్నారు. చావు ఎక్కడైనా వస్తుందని, సంతోష్ చెప్పేవాడని, ఆర్మీలో మరణిస్తేనే చావుకు కూడా ఒక సార్థకత ఉంటుందని తనకు ధైర్యం చెప్పేవాడంటూ ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు.
15 ఏళ్ల సర్వీసులో సమస్యత్మాక ప్రాంతాల్లోనే కల్నల్ నిత్యం డ్యూటీ చేసేవాడని ఆమె చెప్పారు. ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడని వీరమాత వాపోయింది. సంతోష్ కి కూడా ఆర్మీ అంటే చాలా ఆసక్తి ఉండేదని తల్లి మంజుల గుర్తు చేసుకున్నారు. సంతోష్ బాబు ధైర్యవంతుడు, చాలా తెలివైనవాడని మంజుల తెలిపారు. మా పిల్లల్ని విదేశాలకు పంపాలని తాము అనుకోలేదన్నారు. దేశానికి ఉపయోగపడాలనే సంతోష్‌ను ఆర్మీలోకి వెళ్లేలా ప్రోత్సహించామని తెలిపారు.
LoC దగ్గర ఉన్న సమయంలో పరిస్థితుల గురించి విన్నప్పుడు టెన్షన్ పడినప్పుడు తనకు ధైర్యం చెప్పాడని గుర్తు చేసుకున్నారు. ఇన్నేళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నాను కదా… మనల్ని చూసి పాకిస్థానోడు పారిపోవాల్సిందే గానీ, భారత ఆర్మీ పవర్ ఏంటో పాకిస్థాన్ కు తెలుసునని, అయినా వాళ్లు మనల్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తుంటారని కల్నల్ తనకు ధైర్యం చెప్పిన నాటి విషయాలను తల్లి మంజుల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తన కుమారుడు సత్తా ఏంటో తెలుసునని, అందుకే చాలా ధైర్యంగా ఉన్నానని ఆమె అన్నారు. బయటవారు చెప్పినప్పుడు నువ్వు ఎలా ఉన్నావోనని భయంగా ఉందయ్యా అంటే… అమ్మా.. చావు అనేది ఎక్కడైనా వస్తుంది.. ఆర్మీ అయినా సివిల్ అయినా చావు తప్పదని, ఆ చావకు గౌరవం దక్కాలంటే అది ఆర్మీతోనే సార్థకత దొరకుతుందని కల్నల్ చెప్పినట్టు తల్లి మంజుల చెప్పుకొచ్చారు.
సంతోష్ బాబు పుట్టినప్పుడే తనను ఆర్మీకి పంపించాలని అతడి తండ్రి కలలు కనేవాడని మంజుల తెలిపారు. జూన్ 14న తనకు ఫోన్ కాల్ చేశాడని, చెల్లి బావకు ఫోన్ చేసి విషెస్ చెప్పానని తెలిపాడని ఆ తర్వాత సంతోష్ నుంచి ఫోన్ కాల్ రాలేదని మంజుల తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు తన కోడలు ఫోన్ చేసిన మీ అబ్బాయిని తీసుకొస్తానని చెప్పిందని, ఇంతకంటే తాను మాట్లాడలేనంటూ బోరున విలిపించినట్టు కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడికి ఏం జరిగి ఉండొదని, తాను అమరడయ్యాడనే విషయం తెలిసి తాను కుప్పకూలిపోయినట్టు తల్లి మంజుల తెలిపారు.