త్వరలో కూత పెట్టనున్న సెమీ బుల్లెట్ రైళ్లు

త్వరలోనే భారత్‌లో సెమీ బుల్లెట్ రైళ్ల కూత పెట్టనున్నాయి. ఓ వైపు బుల్లెట్ రైళ్ల కోసం ప్రాజెక్టులు సిద్ధమవుతుండగా, మరోవైపు సెమీ బుల్లెట్ రైళ్ల ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. భారతీయ రైల్వే ఇటీవల 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సెమీ బుల్లెట్ రైలును పరీక్షించింది. ఏసీ-3టైర్ బోగీలతో నడిచే ఈ రైలును ప్రయోగాత్మకంగా కోటా-సవాయ్ మాధోపూర్ మధ్య నడిపింది.
కపుర్తలలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఏసీ-3టైర్ బోగీలను రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ కొద్దిరోజులుగా పరీక్షిస్తోంది. తమ ప్రయోగాలు పూర్తయ్యాయని, త్వరలోనే ఒక నివేదికను రూపొందించి పంపుతామని ఆర్గనైజేషన్ తెలిపింది. ఈ బోగీలకు అన్నిరకాల అనుమతులు వచ్చిన వెంటనే భారీ స్థాయిలో వాటి ఉత్పత్తిని ప్రారంభిస్తామని వెల్లడించింది.
సాధారణంగా ఏసీ-3టైర్ బోగీలలో 72 బెర్త్‌లు ఉంటాయి. కానీ ఈ ప్రత్యేక బోగీలో 83 బెర్త్‌లు ఉండే విధంగా ఆధునిక హంగులతో రూపొందించారు. వచ్చే ఏడాదిలోగా 248 బోగీలను సిద్ధం చేసేందుకు ప్రయత్నలు జరుగుతున్నాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ బోగీలను జతచేయనున్నట్టు తెలుస్తోంఇ. నాన్ ఏసీ కోచ్‌లతో నడిచే రైళ్లు 110 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించలేవు.
ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సెమీ బుల్లెట్ రైళ్లకు మాత్రమే ఈ కొత్త బోగీలు ఉపయోగపడతాయి. ఈ కొత్త కోచ్‌లలో USB పాయింట్లు, రీడింగ్ లైట్లు, వికలాంగులు సులభంగా ప్రవేశించేలా ద్వారాలు లాంటి సౌకర్యాలున్నాయి. కేంద్ర అనుమతులు వచ్చిన వెంటనే సెమీ బుల్లెట్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ రెడీగా ఉంది.