రాజకీయాలకు రజనీకాంత్ గుడ్ బై

రాజకీయాలకు రజనీకాంత్ గుడ్ బై

Updated On : December 29, 2020 / 12:59 PM IST

Rajinikanth announces that he won’t be entering politics : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తన రాజకీయ ప్రవేశంపై వెనకడుగు వేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాల్లోకి రావడం లేదంటూ మూడు పేజీల స్టేమెంట్ విడుదల చేశారు. ప్రస్తుతం పార్టీని ఏర్పాటు చేయలేనని ప్రకటించారు. రజనీ రాజకీయాల్లోకి వద్దంటూ కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రజనీ రాజకీయ ప్రవేశంపై చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఆయన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు.
పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు.

ఈనెల 31న ప్రకటన చేయాల్సి ఉంది. అభిమాన సంఘాలు కూడా పార్టీ గుర్తుగా ఆటో కూడా ఖరారైనట్లు ప్రచారం జరిగింది. ఈ సమయంలో హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో రజనీ హైదరాబాద్‌ అపోలోలో చికిత్స పొందారు. డిశ్చార్జ్‌ తర్వాత ఆయన చెన్నై వెళ్లిపోయారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోకి వద్దంటూ ఆయనపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. కూతుళ్లు ఇద్దరూ ఆయనపై తీవ్ర వత్తిడి తెచ్చారు. దీంతో రజనీ వెనకడుగు వేశారు.

ఆరోగ్య కారణాల రీత్యా ఇప్పట్లో రాజకీయాల్లోకి రాలేనని సంకేతాలు ప్రకటించారు. మూడు పేజీల సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. రాజకీయాల్లోకి రావడానికి తన ఆరోగ్యం సహకరించడం లేదన్నారు. తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ప్రజాసంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. రాజకీయాల్లోకి రాకుండానే సేవ చేస్తానన్నారు.