ప్రభుత్వ ఉద్యోగులకు ‘మిషన్ భగీరథ’ వాటర్ బాటిల్స్ : మినరల్ వాటర్ ఎందుకు? మిషన్ భగరథ ఉండగా..!

ప్రభుత్వ ఉద్యోగులకు ‘మిషన్ భగీరథ’ వాటర్ బాటిల్స్ : మినరల్ వాటర్ ఎందుకు? మిషన్ భగరథ ఉండగా..!

Updated On : January 25, 2021 / 4:10 PM IST

Telangana mission bhagiratha water bottles : సీఎం కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మిషన్ భగీరథ’ను విజయవంతంగా అమలు చేస్తోంది. ఇంటింటికీ నీళ్లను సరఫరా చేస్తోంది. ఈ ‘మిషన్ భగీరథ’ వాటర్ ఇకనుంచి ప్రభుత్వ కార్యాలయ్యాలో ఉద్యోగులకు కూడా అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఉద్యోగుల వాటర్ బాటిల్స్లో ఇకనుంచి మిషన్ భగీరథ వాటర్ ఉండనుంది. ‘మినరల్ వాటర్ ఎందుకు? మిషన్ భగీరథ’వాటర్ ఉండగా అంటోంది ప్రభుత్వం.

నీతి ఆయోగ్ మెచ్చిన తెలంగాణ పథకం మిషన్ భగీరథ. ఇంటింటికి తాగునీరు అందించేందుకు కేసీఆర్ సర్కారు నిజంగానే భగీరథ ప్రయత్నం చేసి విజయం సాధించింది. ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేస్తోన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ క్రియేట్ చేసింది. మిషన్ భగీరథను కేసీఆర్ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోందో ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. మిషన్ భగీరథ కోసం 1.46 లక్షల కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు. 69 చోట్ల ఇన్‌టేక్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని 2.72 కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందే ఈ పథకం కోసం తెలంగాణ సర్కారు రూ.37 వేల కోట్లు ఖర్చు చేసింది. కృష్ణా, గోదావరి, వాటి ఉపనదుల నుంచి నీటిని తరలించి.. మారుమూల ప్రాంతాలకు సైతం తాగునీటి సౌకర్యాన్ని కల్పించింది. మినరల్ వాటర్ తాగాల్సిన అవసరం లేదు.. మిషన్ భగీరథ నీళ్లే ముద్దని సర్కారు ప్రచారం చేస్తోంది.

ఈ క్రమంలో ఇకనుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగుల కోసం 300 మిల్లీ లీటర్ల బాటిళ్లలో మిషన్ భగీరథ వాటర్ సరఫరా చేసేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ లోగోతోపాటు.. రాష్ట్ర మ్యాప్.. మిషన్ భగీరథ అనే అక్షరాలు, వాటర్ ట్యాంకుతో ఆకట్టుకునేలా ఈ బాటిళ్లు ఉన్నాయి. బిస్లరీ, హిమాలయ, కిన్లే లాంటి వాటర్ బాటిళ్లను ఇన్నాళ్లూ వాడిన ప్రభుత్వ అధికారులు.. త్వరలోనే ప్రభుత్వ బ్రాండ్ వాటర్ తాగబోతున్నారన్నమాట.