మాజీ ప్రియుల వంటి వాళ్లతోనే డేటింగ్ చేయాలని మీరెందుకు వెంపర్లాడుతుంటారో సైంటిస్టులు చెప్పిన సీక్రెట్..!

డేటింగ్ రిలేషన్ షిప్ అంటే ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నచ్చిన వాళ్లతో కలిసి నచ్చినన్ని రోజులు గడిపేస్తుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమ బలపడితే అది పెళ్లిదాకా వెళ్తుంది. లేదంటే అభిప్రాయాలు కలవలేదని అక్కడితేనే బ్రేకప్ చెప్పేస్తుంటారు. అయితే చాలామందిలో తాను డేటింగ్ చేసిన వ్యక్తి అమ్మాయి లేదా అబ్బాయి ఎవరైనాసరే ఒకరినొకరు తమకు నచ్చని విషయాలపైనే ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు. అభిప్రాయ బేదాలతో ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి విడిపోతుంటారు. డేటింగ్ చేసి బ్రేకప్ అయిన ప్రతి మాజీ ప్రియుడు, ప్రియురాలు మరొకరితో మళ్లీ డేటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.
కానీ, ఇక్కడ తమ మాజీ ప్రియలు లాంటివారితోనే మళ్లీ డేటింగ్ చేయాలని వారంతా తెగ వెంపర్లాడుతుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డేటింగ్ చేసి బ్రేకప్ అయిన అచ్చం మాజీ ప్రియుల స్వభావం కలిగిన వారితోనే ఎందుకు డేటింగ్ చేయాలని ఆరాటపడటడంలో అసలు సీక్రెట్ ఏంటో సైంటిస్టులు బయటపెట్టేశారు. దీనిపై కొత్త అధ్యయనాన్ని కూడా వెల్లడించారు. సాధారణంగా తన మాజీ లాంటి వారుకాకుండా విభిన్న స్వభావం కలిగినవారితోనే డేటింగ్ చేయాలని భావిస్తుంటారు. వ్యక్తులు వేరైనా స్వభావాలు కొన్నిసార్లు ఒకేలా ఉంటాయి. అలాంటి వారితోనే మళ్లీ డేటింగ్ చేయాలని తెగ ఆరాటపడిపోతుంటారని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. University of Torontoలో సోషల్ సైకాలిజిస్టుల చెప్పిన ప్రకారం.. మనలో చాలామంది తమ మాజీలతో సమానమైన వ్యక్తులతో డేటింగ్ చేస్తున్నారని గుర్తించారు.
ఒక రిలేషన్ ముగియగానే.. చాలామంది తమ మాజీ భాగస్వామి వ్యక్తిత్వమే విడిపోవడానికి కారణమని భావిస్తుంటారు. అందుకే మరో స్వభావం కలిగిన వ్యక్తితో డేటింగ్ చేయాలని నిర్ణయించుకుంటారని ప్రధాన రచయిత Yoobin Park అభిప్రాయపడ్డారు. కానీ, దానికి భిన్నంగా ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తితో విడిపోయారో అదే స్వభావం కలిగిన మరో వ్యక్తితో డేటింగ్ చేసేందుకు ఉత్సహం చూపిస్తుంటారని అంటున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న 332 మంది జంటలపై సోషల్ పరిశోధకులు సర్వే నిర్వహించారు. గతంలో మాజీ ప్రియులకు ఇప్పుడు డేటింగ్ చేస్తున్న వారిలో ఎలాంటి స్వభావం ఉందనే దానిపై వారినుంచి అభిప్రాయాలను సేకరించారు.
వీరిలో చాలామంది గత మాజీలకు మాదిరిగానే స్వభావాన్ని కలిగి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. స్వభావంలో ఒకేలా ఉన్నవారితో తమ అభిప్రాయాలను పంచుకునేందుకు వారంతా ఇష్టపడుతున్నారని పరిశోధకులు తెలిపారు.గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు చెప్పకొచ్చారు. మాజీలతో బ్రేకప్ అయిన తర్వాత వారిలో నచ్చిన అంశాలపై ఆసక్తి అలానే ఉండిపోతుందని అంటున్నారు. అదే స్వభావం కలిగిన వ్యక్తితో డేటింగ్ చేసినప్పుడు వారితో గడిపే ప్రతిసమయాన్ని మాజీలతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకునే గడిపేస్తుంటారు. అప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలనే ఆరాటంలో వారితో మరింత ప్రేమగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తుంటారని Park వివరించారు.