Teeth Clean : రాత్రి నిద్రకు మందు బ్రష్ చేసుకోవటం మర్చిపోకండి! ఎందుకంటే?

పగలు అంతా ఆహారం తీసుకుంటున్నప్పుడు నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తూ పళ్లను పదిలంగా కాపాడుతుంది.

Teeth Clean : రాత్రి నిద్రకు మందు బ్రష్ చేసుకోవటం మర్చిపోకండి! ఎందుకంటే?

Teeth Clean

Updated On : April 5, 2022 / 4:07 PM IST

Teeth Clean : ఉదయం వేళ టూత్ బ్రష్ చేసుకోవడంతో పాటు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కచ్చితంగా తిరిగి చెయ్యాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పగటివేళ కంటే రాత్రివేళల్లోనే నోటిలో సూక్ష్మక్రిములు ఎక్కువగా పెరుగుతుంటాయి. దీని వల్ల అనేక రోగాలపాలు కావాల్సి వస్తుంది. అనేక రకాల బాక్టీరియాల నుంచి దంతాలను కాపాడుకోవాలంటే పడుకోబోయే ముందు బ్రష్ చేసుకోవటం ఎంతో మంచిది.

చాలా మంది తమ దైనందిన జీవితంలో ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసుకుంటే సరిపోతుందని భావిస్తారు. పగలంతా వివిధ రకాల ఆహారాలను తినేస్తుంటారు. టీ, కాఫీలు ఎక్కువగా తాగటం వంటి వాటి వల్ల నోటిలో బ్యాక్టీరియాలు చేరతాయి. రాత్రి సమయంలో ఏమి తినకపోయినప్పటికీ తప్పనిసరిగా బ్రష్ చేసుకుని పడుకోవటం మంచిది. కుదరక పోతే నీళ్లతో నోటిని బాగా పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. దంతాలపై పేరుకుపోయిన పాచితో పాటు పళ్ల అంచుల చుట్టూ అతుక్కున్న ఆహార పదార్థాలను ఇది తొలగిస్తుంది. తద్వారా రోగ నిరోధక వ్యవస్థను కాపాడుకున్నవాళ్ళం అవుతాం.

పగలు అంతా ఆహారం తీసుకుంటున్నప్పుడు నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తూ పళ్లను పదిలంగా కాపాడుతుంది. నిద్రలో ఎలాంటి లాలాజలం ఉత్పత్తికాదు. కారణంగా బాక్టీరియా నోట్లో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలపై దాడి చేస్తుంది. అంతేకాదు పంటి ఎనామిల్‌ను దెబ్బతీసే ఆమ్లాలను సైతం ఈ బాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా పళ్లపై గార, పుప్పి పళ్ళు, చిగుళ్ళవాపు తదితర దంత సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీనితో పూర్తి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఐదేళ్ల పిల్లల్లో దంత సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికారణం బర్గర్లు, పిజ్జాలు, క్యాండీస్, చాకొలెట్స్, కోలాడ్రింక్స్ వంటి ఎక్కువ జిగురైన, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం. రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేసుకోవటం వల్ల వాటి ప్రభావం తగ్గే అవకాశాలు ఉంటాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి ఆరోగ్యం కోసం రాత్రి సమయంలో బ్రష్ చేసుకోవటం ప్రస్తుత పరిస్ధితుల్లో తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు.